Advertisement

ఢిల్లీని చిత్తుగా ఓడించిన ముంబై ఫైనల్‌కు..

By: chandrasekar Fri, 06 Nov 2020 11:06 AM

ఢిల్లీని చిత్తుగా ఓడించిన ముంబై ఫైనల్‌కు..


దుబాయ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీని చిత్తుగా ఓడించి౦ది. ఐపీఎల్ 2020 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఫైనల్‌కు దూసుకెళ్లింది రోహిత్ సేన. ఐతే ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడనుంది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ముంబై పేసర్లు బుమ్రా, బౌల్ట్ దెబ్బతీశారు. 0 పరుగులకే 3 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బ తీశారు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులు మాత్రమే చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 57 పరుగుల తేడాతో విజయం సాధించింది ముంబై ఇండియన్స్. మార్కస్ స్టోయినిస్ 65 పరుగులు చేసి ఢిల్లీ పరువు దక్కించాడు. అక్షర్ పటేల్ 42 రన్స్‌తో రాణించాడు. వీరిద్దరు ఆడకపోతే ఢిల్లీ చాలా తక్కువ పరుగులు మాత్రమే చేయగలిగేది. ఇక శ్రేయాస్ అయ్యర్ 12, రిషబ్ పంత్ 3 పరుగులు మాత్రమే చేశారు.

ఈ మ్యాచ్‌ల్లో జాస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ బుల్లెట్‌లాంటి బాల్స్ విసిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డ‌ర్‌ను కుప్పకూల్చారు. మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా, శిఖర్ ధావన్, ఆజింక్య రహానే డకౌట్ అయ్యారు. 0 పరుగులకే మొదటి మూడు వికెట్లు కోల్పోయింది శ్రేయాస్ సేన. పృథ్వీ షా, రహానేను బౌల్ట్ ఔట్ చేయగా ధావన్‌ను బుమ్రా దెబ్బకొట్టాడు. ఇక 4వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్, 8వ ఓవర్లలో రిషబ్ పంత్ కూడా ఔట్ కావడంతో ఢిల్లీ టీమ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత స్టోయినిస్, అక్షర్ పటేల్ మంచి భాగస్వామ్యం నెల్పుతున్న వేళ.. ఏదైనా మ్యాజిక్ చేస్తారా అనుకుంటున్న వేళ.. బుమ్రా వచ్చి మళ్లీ దెబ్బకొట్టాడు. 16వ ఓవర్లో స్టోయినిస్, సామ్‌ను ఔట్ చేశాడు. దాంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మెయిడిన్ ఓవర్ ఉంది. ఇక ట్రెంట్ బౌల్ట్ ఇద్దరిని ఔట్ చేశాడు. ఇక కృనాల్ పాండ్యా, పొలార్డ్‌కు తలో వికెట్ దక్కింది.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, పొలార్డ్ వంటి సీనియర్లు విఫలమైనా కుర్రాళ్లు అదరగొట్టారు. సూర్య, ఇషాన్, డికాక్, హార్దిక్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేసి.. పరుగుల వరద పారించారు. డెత్ ఓవర్లలో చుక్కలు చూపించారు. ఇషాన్ కిషన్ 55, సూర్యకుమార్ యాదవ్ 51, క్వింటన్ డికాక్ 40, హార్దిక్ పాండ్యా 37 పరుగులు చేశారు. రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్ డకౌట్ అయ్యారు. కృనాల్ పాండ్యా 13 రన్స్ చేశాడు.

వాస్తవానికి ముంబై జట్టుకు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అద్భుతమైన షాట్స్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఐతే 8వ ఓవర్లలో డికాక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్, సూర్య కుమార్ ఆచితూచి ఆడారు. 12వ ఓవర్లో సూర్య కుమార్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పొలార్డ్.. రెండు బంతులను ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కృనాల్ కూడా ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా..మెరుపులు మెరిపించాడు. ఇషాన్ కిషన్, హార్దిక్ పోటీ పడి మరీ సిక్స్‌లు కొట్టారు. ఆఖరి ఓవర్లలో ఊచకోత కోసి జట్టు స్కోర్‌ను 200లకు చేర్చారు. హార్దిక్ పాండ్యా 14 బంతుల్లోనే 37 రన్స్ చేశాడు. ఇందులో 5 సిక్స్‌లు ఉన్నాయి.

ఢిల్లీ బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. రోహిత్ శర్మ, పొలార్డ్‌ను డకౌట్ చేయడంతో పాటు అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన డికాక్‌ను ఔట్ చేశాడు. అన్రిచ్ నార్జీ, మార్కుస్ స్టోయినిస్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు 27 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ముంబై 15 సార్లు విజయం సాధించగా ఢిల్లీ టీమ్ 12 సార్లు గెలిచింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటికే రెండు సార్లు తలపడ్డాయి. అక్టోబరు 11న జరిగిన అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత అక్టోబరు 31న జరిగిన దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై జట్టే విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కూడా గెలిచి టోర్నీలో మూడు సార్లు ఢిల్లీని ఓడించింది రోహిత్ సేన. అంతేకాదు ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

Tags :
|
|
|

Advertisement