Advertisement

ప్రపంచంలో ఆరో సంపన్న వ్యక్తిగా ముకేశ్ అంబానీ

By: chandrasekar Wed, 15 July 2020 11:31 AM

ప్రపంచంలో ఆరో సంపన్న వ్యక్తిగా ముకేశ్ అంబానీ


మ‌రో రికార్డు సృష్టించాడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత‌, భార‌త్‌లో అధిక సంప‌న్నుడు అయిన‌ ముకేశ్‌‌ అంబానీ. ప్ర‌పంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ ముందుకు దూసుకుపోయాడు. సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌, ఆల్ఫాబెట్‌ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్‌‌, లారీపేజ్‌ల‌ను కూడా వెనక్కినెట్టి త‌న స్థానాన్ని మరింత మెరుగుప‌ర్చుకున్నాడు. దీంతో ముకేశ్ అంబానీ ప్రపంచంలో ఆరో సంపన్న వ్యక్తిగా‌ అవతరించారు.

కాగా, ముకేశ్ అంబానీ గత వారమే ప్ర‌పంచ కుబేరుల జాబితాలో ప్రముఖ పెట్టుబడిదారు వారెన్‌ బఫెట్‌ను వెనక్కి నెట్టారు. ప్రస్తుతం అంబానీ సంపద 72.4 బిలియన్‌ డాలర్లకు చేరడంతో ఎలాన్ మ‌స్క్‌, లారాపేజ్‌, సెర్గీ బ్రిన్‌ల‌ను దాటి ఆరో స్థానం సొంతం చేసుకున్నార‌ని బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ వెల్ల‌డించింది. మార్చి నుంచి ఇప్పటివరకు రిల‌య‌న్స్‌ సంస్థ షేర్ల విలువ రెట్టింపునకు పైగా పెరిగింది. గత శుక్రవారం రిలయన్స్‌ మార్కెట్‌ విలువ కూడా రూ.12 లక్షల కోట్లను దాటేసింది.

భారత్‌లో కొవిడ్‌ ప్రభావం మొదలైన తొలి రోజుల్లో రిలయన్స్‌ షేర్ల విలువ బాగా తగ్గింది. ఒక దశలో రూ.1000 లోపునకు వచ్చాయి. కానీ, ఆ తర్వాత నుంచి నిదానంగా పుంజుకొన్నాయి. ఫేస్‌బుక్‌తో డీల్‌ తర్వాత వేగంగా విలువను పెంచుకున్నాయి. మార్చి నుంచి ఇప్పటివరకు షేర్ వాల్యూ 120 శాతం పెరిగింది. దీనికి తోడు మార్చి 2021 నాటికి రుణరహిత సంస్థగా అవతరించ‌నున్న‌ట్లు రిల‌య‌న్స్ ప్రకటించడం కూడా ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపి షేర్ విలువ పెరుగ‌డానికి కార‌ణ‌మైంది.

Tags :
|
|

Advertisement