Advertisement

  • వాహనదారులు (బీఐఎస్) హెల్మెట్లనే వాడాలి: కేంద్రం తాజా నిర్ణయం

వాహనదారులు (బీఐఎస్) హెల్మెట్లనే వాడాలి: కేంద్రం తాజా నిర్ణయం

By: chandrasekar Sat, 28 Nov 2020 6:11 PM

వాహనదారులు (బీఐఎస్) హెల్మెట్లనే వాడాలి: కేంద్రం తాజా నిర్ణయం


ఇకపై దేశంలో భారతీయ ప్రమాణాలు (బీఐఎస్) కలిగిన హెల్మెట్లనే తయారు చేయాలని, వాటినే వాహనదారులు వాడాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ‘హెల్మెట్ ఫర్ రైడర్స్ ఆఫ్ టూ వీలర్స్ మోటార్ వెహికిల్స్ ఆర్డర్, 2020’ అనే పేరుతో మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేయగా ఆ సూచనలు ఆధారంగా తాజా నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో ఎయిమ్స్ డాక్టర్లు సహా వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నారు.

భారత శీతోష్ణస్థితికి అనుకూలంగా బరువు తక్కువ ఉన్న హెల్మెట్లను వాడాలని కమిటీ 2018 మార్చిలో సూచనలు చేసింది. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బీఐఎస్ హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినా ప్రాణాపాయం ముప్పు తగ్గే అవకాశం ఉంటుందని ఉపరితల రవాణా శాఖ తెలిపింది. ఏటా దేశంలో దాదాపు 1.7 కోట్ల ద్విచక్ర వాహనాలు తయారు అవుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జెనీవాకు చెందిన ‘ది ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్’ సంస్థ ప్రశంసించింది. ఇకపై భారత్లో బీఐఎస్ ఆమోదించని హెల్మెట్లను విక్రయిస్తే నేరంగా పరిగణిస్తారని సంస్థ అధ్యక్షుడు కేకే కపిలా పేర్కొన్నారు. ఎక్కడ కొనుగోలు చేసినా హెల్మెట్‌పై బీఐఎస్ మార్క్ ఉండాలి. హెల్మెట్‌పై ఈ మార్క్ లేకపోతే పెనాల్టీ పడుతుంది. ఈ నిబంధన 2021 మార్చి 1 నుంచి అమలులోకి వస్తుంది. హెల్మెట్ కొనేవారు మాత్రమే కాకుండా బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా హెల్మెట్లను తయారు చేసే వారికి కూడా జరిమానా పడుతుంది. అంతేకాకుండా జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు.

Tags :
|
|

Advertisement