Advertisement

  • కరీంనగర్‌ లో తృటిలో తప్పిన ప్రమాదం - స్కూటరిస్టుల్ని కాపాడిన గ్రామస్తులు

కరీంనగర్‌ లో తృటిలో తప్పిన ప్రమాదం - స్కూటరిస్టుల్ని కాపాడిన గ్రామస్తులు

By: Dimple Mon, 17 Aug 2020 11:30 PM

కరీంనగర్‌ లో తృటిలో తప్పిన ప్రమాదం - స్కూటరిస్టుల్ని కాపాడిన గ్రామస్తులు

తెలంగాణ పరిసరాలను వరదలు ముంచెత్తున్నాయి. పంటపొలాలు నీటమునిగాయి. రోడ్డుమార్గాలు వరదనీటితో మునకకు గురయ్యాయి దీంతో వాహనచోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ వద్ద తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వరదలో బైక్‌తో సహా ఇద్దరు యువకులు కొట్టుకుపోతుండగా మత్స్యకారులు కాపాడారు. సైదాపూర్-జాగిర్ పల్లి మధ్య చెరువు మత్తడి దూకడంతో లెవెల్‌లో ఉన్న కల్వర్టు వద్ద వరద ఉధృతి ఎక్కువైంది. ఇద్దరు యువకులు కల్వర్టు దాటే ప్రయత్నం చేయగా జారి వరదనీటిలో బైక్‌తో సహా పడిపోయారు.

అక్కడే చేపలు పడుతున్న మత్స్యకారులు గమనించి వెంటనే వారిని కాపాడారు. తాడు సహాయంతో బయటికి లాగారు. బైక్‌తో సహా ఒడ్డుకు లాగిన మత్స్యకారులు ప్రమాదానికి గురైన యువకులను ఎక్కడివారు అని అడిగితే సమాధానం చెప్పకుండా బైక్‌పై పారిపోయారు. ఎక్కడి వారు ఎవరు ఆ యువకులు అనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ సమయస్పూర్తితో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.

అయిదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలు వరంగల్ నగరాన్ని ముంచెతుతున్నాయి. స్థానిక పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్‌, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఉదయం హెలికాప్టర్లో వరంగల్ వెళ్లనున్నారు.

జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కూడా వీరితో కలవనున్నారు. మంత్రుల బృందం నగరంలో పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. వరంగల్ ఎంజిఎంను సందర్శించనున్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తారు. వానలు, వరదలు, కరోనా పరిస్థితిని, తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.


Tags :
|

Advertisement