Advertisement

  • మట్టి మిద్దె కూలడంతో తల్లితో పాటు ఇద్దరు కూతుళ్లు మృతి..

మట్టి మిద్దె కూలడంతో తల్లితో పాటు ఇద్దరు కూతుళ్లు మృతి..

By: Sankar Wed, 19 Aug 2020 11:20 AM

మట్టి మిద్దె కూలడంతో తల్లితో పాటు ఇద్దరు కూతుళ్లు మృతి..


భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మిద్దె కూలి ముగ్గురు మృతి చెందిన విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని గండీడ్ మండలం పగిడ్యాల గ్రామంలో ఈ ఘటన జరిగింది. మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాత మట్టి మిద్దె కూలిపోవడంతో అందులో నివసిస్తున్న శరణమ్మతో పాటు ఆమె కూతుళ్లు వైశాలి (14), భవాని (12) మృతి చెందారు.

తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పాత ఇల్లు కావడంతో మిద్ద పూర్తిగా తడిసి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇంట్లోనే నిద్రిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గతవారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాత ఇళ్లలో నివసిస్తున్న వారు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. వారిని ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ సంఘటన స్దలాన్ని పరిశీలించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. భర్త మల్లప్ప ఆరుబయట పడుకోవడంతో ఈ ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్నాడు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం షాద్‌ నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లితో పాటు ఇద్దరు కూతుళ్లు ఇలా ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబంతో పాటు.. గ్రామంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది.

Tags :
|
|
|

Advertisement