Advertisement

  • అసోంలో ఓ మత బోధకుడి అంత్యక్రియలకు పదివేలకుపైగా జనం

అసోంలో ఓ మత బోధకుడి అంత్యక్రియలకు పదివేలకుపైగా జనం

By: chandrasekar Mon, 06 July 2020 11:10 AM

అసోంలో ఓ మత బోధకుడి అంత్యక్రియలకు పదివేలకుపైగా జనం


కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందడంతో భౌతిక దూరం పాటించాలని, గుంపులు గుంపులుగా తిరుగొద్దని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా కొంత మంది చెవులకు ఎక్కడం లేదు. అసోంలో ఓ మత బోధకుడి అంత్యక్రియలకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే అన్నట్లుగా పదివేలకుపైగా రావడంతో అంతటా కరోనా వైరస్‌ భయం పట్టుకున్నది. దాంతో నాగావ్ జిల్లాలోని మూడు గ్రామాలను అధికారులు మూతవేశారు.

మృతుడి కుమారుడైన ఎమ్మెల్యే అమీనుల్‌ ఇస్లాం అంత్యక్రియల ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌ అయ్యాయి. అఖిల భారత జామియాత్‌ ఉలేమా ఉపాధ్యక్షుడు, ఈశాన్యం యొక్క "అమీర్-ఎ-షరియాత్"గా ఉన్న ఖైరుల్ ఇస్లాం (87) ఈ నెల 2వ తేదీన తుదిశ్వాస విడిచారు. నాగావ్‌లో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి నాగావ్‌ జిల్లాతోపాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

అంత్యక్రియలకు కనీసం 10 వేల మంది హాజరైనట్లు జిల్లా పాలనాధికారులు అంచనావేశారు. దీనిపై పోలీసులు రెండు కేసులు నమోదుచేశారు. అంతేకాకుండా, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి సమీపంలోని మూడు గ్రామాల్లో లాక్‌డౌన్‌ విధించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో హాజరవడంపై కొవిడ్‌-19 చట్టపరంగా చర్యలు తీసుకొంటామని నాగావ్‌‌ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ జాదవ్‌ సైకియా చెప్పారు.

తన తండ్రి స్థానికంగా ప్రసిద్ధులైనందున ఆయన అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలివచ్చారని, అంత్యక్రియల గురించి అధికారులకు సమాచారం ఇచ్చామని ఎమ్మెల్యే అమీనుల్‌ ఇస్లాం చెప్పారు. సోషల్‌ మీడియాలో ఒక మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే అమీనుల్‌ ఇస్లాంను గత ఏప్రిల్‌ నెలలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈయనపై రాజద్రోహం కేసు నమోదైంది. అసోంలో శనివారం 1,202 కొత్త కేసులను గుర్తించడంతో ఇప్పటివరకు 11,000 కేసుల మార్కును దాటింది.

Tags :

Advertisement