Advertisement

గుళ్లో పెళ్లి జంటకు కోతి దీవెనలు

By: Dimple Sat, 12 Sept 2020 08:46 AM

గుళ్లో పెళ్లి జంటకు కోతి దీవెనలు

బంధువులు.. మిత్రులు... స్నేహితులు... సన్నిహితుల నడుమ ఓ వివాహ తంతు నడుస్తోంది. వధూవరులు తలంబ్రాలు పోసుకుంటున్న నేపధ్యంలో ఓ వానరం హఠాత్తుగా వచ్చి ఆశీర్వదించింది. అక్కడున్న పెళ్లివారిలో కొందరు కంగారుపడ్డారు. మరి కొందరు సంబర పడ్డారు. దైవాజ్ఞ లేనిదే ఏమీ జరుగదనే భావన అక్కడి వారిలో వ్యక్తమైంది.

ములుగు జిల్లా మంగంపేట మండలం.. హేమాచల నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కరోనా కష్టకాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిని గుళ్లో నిర్వహించారు. మంగళవాద్యాలు.. వేద మంత్రాల నడుమ మాంగళ్యధారణ జరిగింది.

పెళ్లి తంతులో భాగంగా తలంబ్రాల కార్యక్రమం జరుగుతోంది. ఉన్నట్లుండి వధూవరులపై వానరం దూకడంతో అక్కడి జనమంతా ఉలిక్కి పడ్డారు. పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ భయాందోళనకు గురయ్యారు. ఆతర్వాత దైవసన్నిధిలో జరుగుతున్న తమ పెళ్లి వేడుకకు సాక్షాత్తు ఆంజనేయస్వామివారే వచ్చి ఆశీర్వదించాడనే ఆత్మవిశ్వాసం వారిలో రెట్టింపయింది.

పెళ్లిసందడిలో వానర ఆశీర్వాదం ఘట్టం... పెళ్లి ఫోటోలు తీస్తున్న సమయంలో కెమరాలో నిక్షిప్తమైంది. కొత్త జంటను ఆశీర్వదిస్తున్న వానరం ఫోటో ఇపుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌ ఛల్‌ చేస్తోంది.

Tags :
|

Advertisement