Advertisement

  • కరోనా వ్యాక్సిన్లకు మోడెర్నా సంస్థ మూడో దశ ట్రయల్

కరోనా వ్యాక్సిన్లకు మోడెర్నా సంస్థ మూడో దశ ట్రయల్

By: chandrasekar Wed, 29 July 2020 09:30 AM

కరోనా వ్యాక్సిన్లకు మోడెర్నా సంస్థ మూడో దశ ట్రయల్


అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ కరోనా కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్‌ ‘ఎంఆర్‌ఎన్‌ఏ-1273’ తుది దశ ట్రయల్స్‌ను భారీ ఎత్తున ప్రారంభించింది. ‘కోవె స్టడీ’ పేరుతో అమెరికాలోని 70కి పైగా ప్రాంతాల్లో 30వేల మంది వలంటీర్లపై ట్రయల్స్‌కు శ్రీకారం చుట్టింది. కరోనా వ్యాక్సిన్లకు ప్రపంచంలో ఇదే అతి పెద్ద ట్రయల్‌.

తొలి టీకాలను జార్జియా రాష్ట్రంలోని సవానాకు చెందిన వలంటీర్లకు ఇచ్చారు. ఇది బ్లైండ్‌ తరహా ట్రయల్‌. అంటే 30 వేల మందిలో కొందరికి నిజంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌(ఎంఆర్‌ఎన్‌ఏ-1273) ఇస్తారు. మరికొందరికి ప్లసీబో (సెలైన్‌ ద్రావణం లేదా సురక్షితమైన మరోవ్యాక్సిన్‌) ఇస్తారు. తమకు ఇచ్చిన వ్యాక్సిన్‌ నిజమైనదా కాదా అనే విషయం వారికి తెలియదు. ప్రతి వలంటీర్‌కూ 2 మోతాదుల వ్యాక్సిన్‌ ఇచ్చి వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారు. ఈ వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఆస్పత్రిలో ఉండాల్సిన పని లేదు. సాధారణ జీవితాన్ని గడపొచ్చు. మోడెర్నా సంస్థ వ్యాక్సిన్‌ తయారీని మొదలుపెట్టిన 2 నెలల్లోనే మానవ ప్రయోగాల దశకు చేరింది.

తొలి దశ ప్రయోగాల్లో కొన్ని దుష్ప్రభావాలు (కొద్దిపాటి జ్వరం, చలి-వణుకు, ఇంజెక్షన్‌ చేసిన చోట నొప్పి వంటివి) కనిపించినప్పటికీ, మొత్తంగా ప్రోత్సాహకర ఫలితాలనే చూపింది. కానీ వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని, అది సురక్షితమనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి భారీ ప్రయోగాలు అవసరమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. మోడెర్నా కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ డిసెంబరు కల్లా అందుబాటులోకి వస్తుందని ఎన్‌ఐహెచ్‌ డైరెక్టర్‌ ఫ్రన్సిస్‌ కాలిన్స్‌ తెలిపారు.

Tags :

Advertisement