Advertisement

  • కోస్తా , రాయలసీమలో రెండు రోజులు ఒక మోస్తరు వర్షాలు

కోస్తా , రాయలసీమలో రెండు రోజులు ఒక మోస్తరు వర్షాలు

By: Sankar Mon, 05 Oct 2020 09:47 AM

కోస్తా , రాయలసీమలో రెండు రోజులు ఒక మోస్తరు వర్షాలు


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మరోవైపు ఉత్తర అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 9వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో పార్వతీపురంలో 7 సెం.మీ, కురుపాం, వీరఘట్టం, బొబ్బిలి, గురుగుబెల్లిలో 5, పమిడి, బలిజిపేట, వేపాడ, సీతానగరం, పాలకొండ, అమలాపురంలో 3 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది

పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణా, ఉప నదుల్లో వరద తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 41,436 క్యూసెక్కులకు ప్రవాహం తగ్గడంతో గేట్లను ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో పూర్తిగా మూసివేశారు. కుడి కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 27,460 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 7 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవాకు 1,350 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.8 అడుగుల్లో 214.36 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్‌లోకి 45,945 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 8,650, ఎడమ కాలువకు 5,782, ఏఎమ్మార్పీకి 1,800, ఎఫ్‌ఎఫ్‌సీకి 600 క్యూసెక్కులు వదులుతున్నారు

Tags :
|
|

Advertisement