Advertisement

  • గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి

గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి

By: chandrasekar Fri, 07 Aug 2020 3:50 PM

గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి


గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేసి వృత్తి ధర్మాన్ని పాటించిన ఎమ్మెల్యే శ్రీదేవిపై పార్టీ అభిమానులు, స్థానికులు ప్రసంశల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆమె ఒక ఎమ్మెల్యే కానీ అంతకు ముందు ఒక వైద్యురాలు. ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఓ యువకుడు ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడి ఉండటాన్ని చూశారు. వెంటనే తన వాహనాన్ని ఆపి బాధితుడి దగ్గరికి వచ్చారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆమె తన వృత్తి ధర్మాన్ని పాటించారు.

తాడికొండ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు ఉండవల్లి శ్రీదేవి తాను ప్రయాణిస్తున్న మార్గంలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రోడ్డుపై అల్లాడుతున్న వ్యక్తికి అప్పటికప్పుడు ప్రథమ చికిత్స చేశారు. గురువారం, ఆగస్టు 6 సాయంత్రం ఆమె గుంటూరు నుంచి పిడుగురాళ్ల మీదగా వెళ్తుండగా పిడుగురాళ్ల వద్ద ఓ ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి.

కరోనా భయంతో అక్కడ ఉన్న వాళ్లెవరూ బాధితుడి దగ్గరికి వెళ్లేందుకు సంశయించారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఎమ్మెల్యే శ్రీదేవి హుటాహుటిన తన వాహనంలో నుంచి దిగి గాయపడిన వ్యక్తి దగ్గరకు చేరుకున్నారు. చేతికి గ్లోవ్స్ ధరించి బాధితుడి నాడి పరీక్షించారు. నాడి కొట్టుకోవడం గమనించిన ఆమె వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అప్పటికే ఆమె అనుచరులు పోలీసులకు సమాచారం అందించారు.

పెట్రోలింగ్ వాహనంలో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని వాహనంలోకి ఎక్కించి హాస్పిటల్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి స్థానికులతో మాట్లాడారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవాలని అలా చూస్తూ ఉండటం సరైన విధానం కాదని అన్నారు. కరోనా భయం ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకొని సాయం అందించాలని సూచించారు. తన మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్యే శ్రీదేవిపై పార్టీ అభిమానులు, స్థానికులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. బాధితుడికి సకాలంలో వైద్య సేవలందించడంతో ఆపద నుండి బయటపడ్డాడు.

Tags :
|

Advertisement