Advertisement

  • వరదప్రాంతాల్లో ఎమ్మెల్యే సీతక్క ‘ఆటో ఏరియల్ సర్వే

వరదప్రాంతాల్లో ఎమ్మెల్యే సీతక్క ‘ఆటో ఏరియల్ సర్వే

By: Dimple Mon, 17 Aug 2020 11:08 PM

వరదప్రాంతాల్లో ఎమ్మెల్యే సీతక్క ‘ఆటో ఏరియల్ సర్వే

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో చాలా గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలంలో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత 60 అడుగులకు చేరింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల బాధలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ వేళ ఏజెన్సీ గ్రామాల ప్రజలను అమ్మలా ఆదరించిన సీతక్క.. ఇప్పుడు వరద నీటితో వాళ్లు పడుతున్న ఇక్కట్లను తెలుసుకోవడానికి వినూత్న మార్గం ఎంచుకున్నారు. ‘ఆటో ఏరియల్ సర్వే’ ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు.

జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇళ్లలోకి నీరు చేరింది. గోదావరి బ్యాక్ వాటర్‌ పలు గ్రామాలను ముంచేస్తోంది. మేడారంలో జంపన్నవాగు పొంగి పొర్లుతోంది. సమ్మక్క, సారలక్క గద్దెలను కూడా వరద నీరు ముంచెత్తింది. లక్నవరం, రామప్ప చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఎమ్మెల్యే సీతక్క కొంత మంది అనుచరులతో ఆటోలో తిరుగుతూ ఆయా ప్రాంతాలను పరిశీలించారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కనుచూపు మేర నీరే కనిపిస్తోంది. పంటపొలన్నీ నీటిలో మునిగిపోయాయి. బోరుబావులు, స్టాటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు నీటిలో మునిగిపోయాయి.

ఏజెన్సీ వాసుల వెతలు, రైతులను కష్టాలను కళ్లారా చూసిన ఎమ్మెల్యే సీతక్క.. ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తూ దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేరేవిధంగా అందరూ సహకరించాలని కోరారు. నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ పంపించాలని కోరారు.

Tags :
|
|
|
|

Advertisement