Advertisement

  • తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి..ఘన నివాళులు అర్పించిన తెరాస శ్రేణులు

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి..ఘన నివాళులు అర్పించిన తెరాస శ్రేణులు

By: Sankar Thu, 06 Aug 2020 12:51 PM

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి..ఘన నివాళులు అర్పించిన తెరాస శ్రేణులు



తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు, తెలంగాణ అభిమానులు కొనియాడారు.

ఆచార్య జయశంకర్ జయంతి సంద‌ర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయన నివాసంలో సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన సలహాలు, సూచనలు భవిష్యత్‌ మార్గదర్శకమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా జీవించారని, యావత్‌ జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారన్నారు. సార్ ఆశ‌యాల‌నే ఆదేశిక సూత్రాలుగా, సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ‌గా తీర్చిదిద్దుతున్నారన్నారు.

అలాగే మంత్రి హరీశ్‌రావు, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌ వేదిక ద్వారా జయశంకర్‌ సార్‌కు నివాళులర్పించారు. ‘మహాకవి కాళోజి చెప్పినట్లుగా పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానిది అన్నట్లు జీవితాంతం తెలంగాణ కోసమే తపించిన మహా మనిషి. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపి బంగారు తెలంగాణకు మార్గ దర్శనం చేసిన మహాత్మా శ్రీ కొత్తపల్లి జయశంకర్ సారుకు నివాళులు’ అంటూ మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. ‘

తెలంగాణ రాష్ట్ర సాధనే ఊపిరిగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు, తెలంగాణ రాష్ట్ర సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాం’.. అంటూ కవిత ట్వీట్‌ చేశారు.

తెలంగాణ సిద్ధాంతకర్త ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ సర్‌ చిరస్మరణీయుడని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జయశంకర్ సర్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణే ఊపిరిగా, శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసం ఉద్యమించారని కొనియాడారు.


Tags :

Advertisement