Advertisement

  • అంతర్వేది రథం దగ్ధం ఘటనలో ఎవ్వరిని వదలము.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

అంతర్వేది రథం దగ్ధం ఘటనలో ఎవ్వరిని వదలము.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

By: Sankar Wed, 09 Sept 2020 9:16 PM

అంతర్వేది రథం దగ్ధం ఘటనలో ఎవ్వరిని వదలము.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్


తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో రథం కాల్చివేత చాలా బాధాకరమని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఈ మేరకు బుధవారం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రథం కాల్చివేత జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారని వెల్లడించారు.

అలాగే రూ. 95 లక్షలతో కొత్త రథాన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు కులాలను, మతాలను రెచ్చగొడుతున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రథాన్ని తగులబెట్టిన వారిని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతల ముసుగులో కొంత మంది విద్రోహులు చర్చిపై రాళ్లు రువ్వారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. గుడులు, చర్చి, మసీదుపై దాడులు చేసే వారిని క్షమించబోమని హెచ్చరించారు..

రథం దగ్ధంపై ఇంకా విచారణ జరుగుతుండగానే ఈ విషయంపై కొంత మంది విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 40 దేవాలయాలను కూల్చివేశారని, అందులో బీజేపీ, జనసేనకు భాగస్వామ్యం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కూల్చివేసిన దేవాలయాలను నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని గుర్తు చేశారు.

Tags :

Advertisement