Advertisement

  • పాసు పుస్తకం ఉన్నవారికే రైతుబంధు.. వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి

పాసు పుస్తకం ఉన్నవారికే రైతుబంధు.. వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి

By: Sankar Wed, 16 Sept 2020 11:04 AM

పాసు పుస్తకం ఉన్నవారికే రైతుబంధు.. వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి


రాష్ట్రంలోని కౌలుదారుల‌కు రైతుబంధు ఇవ్వ‌డం కుద‌రదు. ఇదే విష‌యాన్ని సీఎం కేసీఆర్ అనేక సంద‌ర్భాల్లో గుర్తు చేశార‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రైతుబంధు ప‌థ‌కంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన రైతుబంధు ప‌థ‌కం కింద‌ 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 12 వేల కోట్లు, 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 12 వేల కోట్లు, 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 14 వేల కోట్లు కేటాయించిన‌ట్లు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తెలిపారు.

రైతు బంధు ప‌థ‌కాన్ని ఏ రాష్ర్టం కూడా అమ‌లు చేయ‌డం లేదు. ఈ ప‌థ‌కం కేసీఆర్ మాన‌స‌పుత్రిక‌. ప‌ట్టాదారు పాసుపుస్త‌కం క‌లిగి ఉన్న రైతు మాత్ర‌మే ఈ ప‌థ‌కానికి అర్హుడు అని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ ప‌థ‌కం కోసం ప్ర‌తి సంవ‌త్స‌రం బ‌డ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నామ‌ని తెలిపారు.

కొవిడ్ కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ.. వ్య‌వ‌సాయ రంగాన్ని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల కింద చేర్చి.. రైతాంగానికి రైతుబంధు ఇచ్చామ‌న్నారు. కౌలు రైతుల‌కు రైతుబంధు ఇవ్వ‌డం సాధ్యం కాద‌న్నారు. భూమి య‌జ‌మానికే అది కూడా సీసీఎల్ఏ ద్వారా ప‌ట్ట‌దారు పాసుపుస్త‌కం పొందిన వారికే ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌న్నారు

Tags :

Advertisement