Advertisement

  • ఇలాంటి ఉత్పాతం వందేళ్ల‌కు ఒక‌సారి వ‌స్తుంది‌ : మ‌ంత్రి కేటీఆర్

ఇలాంటి ఉత్పాతం వందేళ్ల‌కు ఒక‌సారి వ‌స్తుంది‌ : మ‌ంత్రి కేటీఆర్

By: chandrasekar Tue, 20 Oct 2020 6:03 PM

ఇలాంటి ఉత్పాతం వందేళ్ల‌కు ఒక‌సారి వ‌స్తుంది‌ : మ‌ంత్రి కేటీఆర్


హైద‌రాబాద్‌లో కురిసిన వ‌ర్షం చ‌రిత్ర‌లో రెండో అతి పెద్ద వ‌ర్షం అని పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మూసీకి వ‌ర‌ద‌లు వ‌చ్చిన 1908లో 43 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఈ ఏడాది ఇప్ప‌టికే 120 సెం.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది అని తెలిపారు. ఇలాంటి ఉత్పాతం వందేళ్ల‌కు ఒక‌సారి వ‌స్తుంద‌న్నారు. చ‌రిత్ర‌లో ఈ ఏడాదే ఎక్కువ వ‌ర్షం న‌మోద‌య్యే అవ‌కాశం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఉద‌యం జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఉన్న‌తాధికారులతో మంత్రి కేటీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను కేటీఆర్ స‌మీక్షించారు. స‌మీక్ష స‌మావేశం ముగిసిన అనంత‌రం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై ప్ర‌భుత్వం పూర్తి అప్ర‌మ‌త్తంగా ఉంద‌ని తెలియజేసారు. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షం వ‌ల్లే కాల‌నీలు జ‌ల‌మ‌యం అయ్యాయ‌ని, రెండు రోజులు తెరిపి ఇస్తే నీటిని తొల‌గించేందుకు వీలు ఉంటుంద‌న్నారు. ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల కార‌ణంగా స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఇబ్బందులు కలుగుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో ప్ర‌తి ఒక్క‌రూ పున‌రావాస కేంద్రాల‌కు వెళ్లాల‌ని కేటీఆర్ సూచించారు. పున‌రావాస కేంద్రాల్లో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. అపార్ట్‌మెంట్ల‌లో ఉన్నవాళ్ల‌కు అతి విశ్వాసం వ‌ద్దు.. పున‌రావాస కేంద్రానికి రావాల‌న్నారు. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో వ‌స్తే చాలు అన్ని ర‌కాల సేవ‌లు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు.

క్యుములో నింబ‌స్ మేఘాల వ‌ల్ల అధిక వ‌ర్షాలు ప‌డుతున్నాయి. వేలాది మందిని పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించామ‌న్నారు. ప్రాణ న‌ష్టాన్ని చాలా వ‌ర‌కు త‌గ్గించ‌గ‌లిగామ‌ని అన్నారు. మ‌రో మూడు రోజులు భారీ వ‌ర్షాలు ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నామ‌ని చెప్పారు. ఆ ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తామ‌న్నారు. వ‌ర‌ద ప‌రిస్థితిని స‌మీక్షించేందుకు 80 మంది ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించామ‌ని తెలిపారు. శిథిలావ‌స్థ‌లో ఉన్న భ‌వ‌నాల‌ను కూల్చివేస్తామ‌ని చెప్పారు. 37 వేల రేష‌న్ కిట్లు పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు. ఒక్కో కిట్‌లో నెల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌ర స‌రుకులు, దుప్ప‌ట్లు అందిస్తున్నామ‌ని తెలిపారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని చెప్పారు. విద్యుత్ పున‌రుద్ధ‌ర‌ణ కోసం చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు. 164 ట్రాన్స్‌ఫార్మ‌ర్ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయాల్సి ఉంద‌న్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 80 కాల‌నీల్లో ప్ర‌స్తుతం నీళ్లు ఉన్నాయి. ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాల‌నీల్లోని ప్ర‌జ‌ల‌ను క‌చ్చితంగా ఆదుకుంటామ‌న్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 33 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 29 మందికి రూ. 5 ల‌క్ష‌ల చొప్పున సాయం అందించామ‌ని తెలిపారు. గ‌ల్లంతు అయిన మ‌రో ముగ్గురిని గుర్తించే ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. వ‌ర‌ద బాధితులు, మ‌ర‌ణాల‌పై ప్ర‌భుత్వం వ‌ద్ద పూర్తి స‌మాచారం ఉంద‌న్నారు. న‌గ‌రంలో చెరువులు, నాలాలు ఆక్ర‌మ‌ణ‌కు గురైన విష‌యం వాస్త‌వ‌మేన‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Tags :
|

Advertisement