Advertisement

వచ్చే సంవత్సరం దేశంలో మినీ రాజకీయ సమరం...

By: chandrasekar Mon, 07 Dec 2020 6:55 PM

వచ్చే సంవత్సరం దేశంలో మినీ రాజకీయ సమరం...


2021లో వివిధ రాష్టాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో, కొత్త కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. తమకు ఇంతవరకు ఉనికి అంతగా లేని రాష్ట్రాల్లోనూ బలం నిరూపించుకోవాలని కేంద్రంలోని బీజేపీ పట్టుదలగా ఉంటే మళ్లీ పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాషాయ దళం మధ్య ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆయా రాష్ట్రాల్లోని బలమైన ప్రాంతీయ పార్టీలు సైతం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

2021లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల పరిస్థితులు...

వచ్చే సంవత్సం ఏప్రిల్‌లో ఎన్నికలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే రాజకీయం రణరంగంగా మారింది. కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్శల దాడి చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ(దీదీ)ని ఓడించి బెంగాలీ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లోనూ టీఎంసీకి గట్టిపోటీని ఇచ్చి కాషాయ దళం ప్రధాన ప్రతిపక్షంగా ఎదిరిగింది. అలాగే సీఎం మమత సైతం తన చతురత, దూకుడుతో ప్రత్యర్థి పార్టీలను చిత్తుచేసి మరోసారి అధికారం చేపట్టాలనే పట్టుదలతో ఉన్నారు. మరోవైపు 2011కు ముందు 34 ఏళ్ల పాటు వరుసగా బెంగాల్​ను పాలించిన కమ్యూనిస్టు పార్టీ పునర్వైభవం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైంది. వెస్ట్ బెంగాల్​లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

తమిళనాడులో ఎన్నికలు...

మాజీ ముఖ్యమంత్రులు దివంగత జె.జయలలిత, ఎం.కరుణానిధి లేకుండా 2021 మేలో తమిళనాడులో తొలిసారి పూర్తిస్థాయి ఎన్నికలు జరుగనున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకే, డీఎంకే మధ్యే ద్విముఖ పోరు ఖాయంగా కనిపిస్తున్నా.. సూపర్ స్టార్ రజినీకాంత్ రంగ ప్రవేశంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం పవర్‌లో ఉన్న అన్నాడీఎంకే వచ్చే ఎన్నికలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోనుంది. మరోవైపు సూపర్ స్టార్ రజినీ కాంత్ జనవరిలో రాజకీయ పార్టీ ప్రకటించనుండడంతో తమిళనాట రాజకీయాలు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. అలాగే రజనీ కొత్తగా పెట్టబోయే పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేయనుండడం ఆసక్తికరంగా మారింది.

అసోం అసెంబ్లీ ఎన్నికలు:

అసోం అసెంబ్లీలో మొత్తం 126 స్థానాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఏప్రిల్- మే మధ్య ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. 2016లో అసోం ప్రజలు ఏ పార్టీకి సంపూర్ణంగా పట్టం కట్టలేదు. 60 స్థానాలతో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. అసోం ఘన పరిషత్ 14, BPF 13 సీట్లలో విజయం సాధించాయి. ఈ పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. సర్బానంద సొనోవాల్ సీఎం పదవి చేపట్టారు. ప్రతిపక్ష కాంగ్రెస్ 23 స్థానాల్లో, AIUDF 14 సీట్లను దక్కించుకుంది. ఈసారి ఎలాగైనా సొంతంగా అధికారం దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే పుంజుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.

కేరళలో ఎన్నికలు...

కేరళలో ప్రతీ ఐదేళ్లకోసారి అధికారం చేతులు మారుతూ ఉంది. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో వచ్చే సంవత్సరం మేలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార CPM, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. కేరళలోనూ పాగా వేసి దక్షిణాదిలో బలం పెంచుకోవాలని బీజేపీ సైతం తహతహలాడుతోంది. 2016 ఎన్నికల్లో సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ మూడింట రెండు వంతుల సీట్లను గెలుచుకొని అధికారం చేపట్టింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్(UDF) తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకొని 47స్థానాలతో పవర్ కోల్పోయింది. బీజేపీ ఒక్కసీటే సాధించినా బోణీ కొట్టినందుకు సంతోషపడింది. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన వారు కేరళ జనపక్షం(సెక్యులర్) పేరుతో ఏకంగా పార్టీ నెలకొల్పారు. మరి కేరళలో ఈ సారి రెండు పార్టీల సమరం ఉంటుందో.. త్రిముఖ పోరు జరుగుతుందో చూడాలి.

జమ్మూకాశ్మీర్ లో...

సెక్షన్ 370, 35ఏ తొలగింపు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో తొలిసారి 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూకాశ్మీర్, లద్ధాఖ్ విడిపోయి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు అయ్యాక జరిగే పోరు కావడంతో దేశం దృష్టి మొత్తం ఈ ప్రాంతంపైనే ఉంది. ఏడాది కాలంగా ఆందోళనలు, తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడికిపోయిన కాశ్మీరం క్రమంగా సాధారణ స్థితికి వస్తోంది. ఇక 2014లో 87 గా ఉన్న అసెంబ్లీ సీట్లు జమ్మూకాశ్మీర్‌లో 111కు పెరిగాయి. గత ఎన్నికల్లో 28 సీట్లు సాధించిన పీపుల్ డెమొక్రటిక్ పార్టీ(PDP), 25 స్థానాల్లో గెలిచిన బీజేపీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నేషనల్ కాన్ఫరెన్స్ (NC) 15, కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలిచాయి. అయితే విభేదాలతో పీడీపీ, బీజేపీ విడిపోవడంతో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం అర్ధాంతరంగా కుప్పకూలింది. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్‌లో 370 సెక్షన్ సహా రాష్ట్ర హోదాను సైతం కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఉద్రిక్తతలు రేగి.. ఎన్నికలు వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి.

Tags :
|
|

Advertisement