Advertisement

  • హైదరాబాద్‌లో ఇక మెట్రోరైళ్ల కదలిక - మాస్క్‌ ఉంటేనే ప్రయాణం

హైదరాబాద్‌లో ఇక మెట్రోరైళ్ల కదలిక - మాస్క్‌ ఉంటేనే ప్రయాణం

By: Dimple Fri, 04 Sept 2020 09:24 AM

హైదరాబాద్‌లో ఇక మెట్రోరైళ్ల కదలిక - మాస్క్‌ ఉంటేనే ప్రయాణం

హైదరాబాద్‌లో మెట్రో రైళ్లను ఈనెల 7 నుంచి నడపనున్నట్లు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడుస్తాయన్నారు. ప్రయాణికుల సామర్థ్యానికి అనుగుణంగా అదనపు సర్వీసులపై నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

తొలిరోజైన 7న మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయి. 8న కారిడార్‌-3లోని నాగోల్‌-రాయదుర్గం సర్వీసులు నడుపుతారు. 9న కారిడార్‌ 1, 2, 3లో పూర్తిస్థాయిలో నడుస్తాయి. ప్రతి 5 నిమిషాలకు ఒకటి ఉంటుందన్నారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ఉన్న గాంధీ ఆసుపత్రి, భరత్‌నగర్, మూసాపేట్, ముషీరాబాద్, యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్లు మూసివేయనున్నట్లు తెలిపారు.

నిబంధనలు పాటిస్తూ..
స్మార్ట్‌కార్డు, నగదు రహిత పద్ధతిలో టికెట్ల విక్రయం ఉంటుంది. ప్రయాణికులు నిలబడేందుకు, కూర్చునేందుకు మార్కింగ్‌లు ఉంటాయి. ప్రవేశమార్గాల వద్ద థర్మల్‌స్క్రీనింగ్‌ చేస్తారు. శానిటైజర్లు ఉంచుతారు. స్టేషన్లు, రైళ్లలో భౌతికదూరం పాటించేలా చేస్తారు. మాస్క్‌ ధరించకపోతే జరిమానా విధిస్తారు.

కరోనా అనుమానిత లక్షణాలు లేనివారే ప్రయాణించాలని, వెంట తక్కువ సామగ్రి తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. వాహన పార్కింగ్‌ ప్రదేశాలు తెరిచే ఉంటాయన్నారు. సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి అనిల్‌కుమార్‌శైనాని, సీనియర్‌ అధికారులు డి.వి.ఎస్‌.రాజు, ఎస్‌.కె.దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Advertisement