Advertisement

చెన్నై సూపర్‌ కింగ్స్‌ బృందంలో కరోనా కలవరం

By: Dimple Fri, 28 Aug 2020 5:44 PM

చెన్నై సూపర్‌ కింగ్స్‌ బృందంలో కరోనా కలవరం

ఐపీఎల్ ప్రారంభానికి ముందు నిర్వాహకులకు షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో కొందరు సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. ఒక ప్లేయర్, కొందరు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ళు శుక్రవారం ప్రాక్టీస్ ప్రారంభించాల్సి ఉంది. అయితే హాఠాత్తుగా క్వారంటైన్ టైమ్ పొడిగించుకోవడంతో అందరిలోనూ అనుమానాలు తలెత్తాయి. మీడియా వర్గాలు ఆరా తీయగా సహాయక సిబ్బందికి కోవిడ్ సోకివట్టు తేలింది.

కోవిడ్ సోకిన వివరాలు బయటకు వెల్లడించకున్నా... వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితుల్లో ఆ జట్టు మొత్తం ఆటగాళ్ళంతా మళ్ళీ క్వారంటైన్ కే వెళ్ళిపోయారు. మరో నాలుగు రోజుల పాటు చెన్నై జట్టు క్వారంటైన్ లోనే ఉంటుంది. అయితే చెన్నై నుంచి కోవిడ్ పరీక్షలు చేయించుకున్న తర్వాతే దుబాయ్ కు పయనమైన ఆటగాళ్ళకు అక్కడ కూడా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ రావడంతో దుబాయ్ నిబంధనల ప్రకారం క్వారంటైన్ కు పంపించారు.

అయితే కోవిడ్ దిగిన వెంటనే సోకిందా... లేక క్వారంటైన్ మధ్యలో ఏదైనా పొరపాట్ల వల్ల సోకిందా అనేది తెలియాల్సి ఉంది. దీనికి తోడు గత కొన్ని రోజులుగా యుఏఈలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితి ఆటగాళ్ళకే కాదు లీగ్ నిర్వహించనున్న బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు ఇబ్బందే. ఇప్పటికిప్పుడే లీగ్ నిర్వణకు ఆటంకం కలుగుతుందని చెప్పలేకున్నా... ఎంతో కొంత ప్రభావం అయితే కనిపిస్తుందని భావిస్తున్నారు.

ఎటువంటి ఇబ్బందీ లేకుండా పూర్తి బయోసెక్యూర్ బబూల్ లో లీగ్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసుకోగా.. తాజా పరిస్థితి వారికి షాక్ ఇచ్చింది. అయితే ముందుగా రూపొందించుకున్న నిబంధనల ప్రకారం ఎవరికైనా కోవిడ్ సోకితే క్వారంటైన్ నిబంధనలు పాటించి నెగెటివ్ వస్తేనే అనుమతిస్తారు. ఒకరిద్దరు ఆటగాళ్ళకు కోవిడ్ వచ్చినా పర్వాలేదు ఒకవేళ పూర్తి జట్టుకు వస్తే పరిస్థితి ఏంటనేదే ఇక్కడ అందరిలోనూ మెదులుతోన్న ప్రశ్న. ఒకవైపు పూర్తి స్థాయి షెడ్యూల్ పై తర్జన భర్జన పడుతోన్న బోర్డుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం మరో షాక్ గా చెప్పొచ్చు.

Tags :
|
|

Advertisement