Advertisement

కొళాయి నీళ్లలో ప్రాణాంతకమైన సూక్ష్మ జీవి

By: chandrasekar Tue, 29 Sept 2020 5:15 PM

కొళాయి నీళ్లలో ప్రాణాంతకమైన సూక్ష్మ జీవి


కరోనావైరస్‌ సమస్య ఇంకా విడిచిపెట్టనే లేదు మళ్ళీ అమెరికాలో ఇంకో సమస్య ప్రారంభమైంది. తాజాగా టెక్సాస్‌లోని లేక్ జాక్సన్ సిటీలోని పబ్లిక్ ట్యాప్ నీళ్లలో కంటికి కనిపించని మెదడుని తినేసే నేగ్లేరియా ఫోలెరి అనే ప్రాణాంతకమైన సూక్ష్మజీవులు ఉన్నట్టు అక్కడి అధికారులు గుర్తించారు. ఈ సూక్ష్మజీవులు కారణంగానే ఓ ఆరేళ్ల బాలుడు చనిపోయినట్టు తెలియడంతో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే మునిసిపల్ అధికారులు 11 చోట్ల శాంపిల్స్‌ని సేకరించి పరిశీలించగా అందులో మూడు చోట్ల కొళాయి నీళ్లలో ప్రాణాంతకమైన నేగ్లేరియా ఫోలెరి అనే అమీబా ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన టెక్సాస్ ఎన్విరాన్‌మెంటల్ క్వాలిటీ కమిషన్. ''లేక్ జాక్సన్, ఫ్రీపోర్ట్, యాంగిల్టన్, బ్రెజోరియా, రిచ్‌ఉడ్, ఓయ్‌స్టర్ క్రీక్, క్లూట్, రొజెన్‌బర్గ్, డో కెమికల్, టిడిసిజె క్లెమెన్స్, టిడిసీజే వేన్ స్కాట్ వంటి పట్టణాల్లో కొళాయి నీటిని వినియోగించొద్దు'' అని పేర్కొంటూ హెచ్చరిక ప్రకటనలు విడుదల చేశాయి.

2011-2013 మధ్య కాలంలో ఈ నేగ్లెరియా పోలెరితో తొలి మరణం నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. కంటికి కనిపించని ఈ సూక్ష్మ జీవి పేరే నేగ్లేరియా ఫోలెరి. గతంలోనూ నేగ్లెరియా ఫోలెరితో పలువురు చనిపోయారని టెక్సాస్ ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ కమిషన్ తెలిపింది. కలుషితమైన నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనిషిలోకి ప్రవేశించే ఈ సూక్ష్మ జీవులు క్రమక్రమంగా మెదడుకు వ్యాపిస్తాయి. తద్వారా సోకే వ్యాధినే ప్రైమరి అమేబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అని పిలుస్తారు. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ( CDC ) వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, మూర్ఛ, వాంతులు, నిద్ర, వికారం, ఏవేవో భ్రాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకి అనారోగ్యానికి గురైన వారంలోనే మరణిస్తారని సీడిసి పేర్కొంది. ప్రస్తుతం నిల్వ ఉన్న నీరుని వృధాగా పోనిచ్చి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ శాంపిల్స్ పరీక్షించి, అందులో సూక్ష్మీ జీవులు లేవు అని నిర్ధారణ అయ్యే వరకు కొళాయి నీళ్లను వినియోగించరాదని అధికారులు పౌరులను హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నీటిని బాగా మరగబెట్టిన తర్వాతే వాడుకోవాలని, స్నానం చేసేటప్పుడు, ముఖం కడుక్కునేటప్పుడు ముక్కు లోపలికి నీరు పోకుండా జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ సూక్ష్మజీవుల బారినపడే సమస్య అధికంగా ఉందని అధికారులు పౌరులకు హెచ్చరించారు.

Tags :
|

Advertisement