Advertisement

  • ముదురుతున్న మహరాష్ట్ర ప్రభుత్వం , గవర్నర్ వివాదం...

ముదురుతున్న మహరాష్ట్ర ప్రభుత్వం , గవర్నర్ వివాదం...

By: Sankar Wed, 14 Oct 2020 9:52 PM

ముదురుతున్న మహరాష్ట్ర ప్రభుత్వం , గవర్నర్ వివాదం...


మ‌హారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే సాగుతున్నాయి.. బీజేపీకి శివ‌సేన బైబై చెప్పిన‌ప్ప‌టి నుంచి పొలిటిక‌ల్ హీట్ కొన‌సాగుతూనే ఉంది.. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయ‌పార్టీల మ‌ధ్య ఎత్తుకు పైఎత్తులు, విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు కొన‌సాగ‌గా.. తాజాగా ప్ర‌భుత్వం, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య పొస‌గ‌డంలేదు..

గవర్నర్ కోషియారీకి, శివ‌సేన సంకీర్ణ స‌ర్కార్‌కు మధ్య వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది.. దీంతో.. గవర్నర్‌‌ను తొలగించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాయాలని శివసేన నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. మిగతా భాగస్వామ్య పక్షాలతో చర్చించి... తుది నిర్ణయానికి వ‌స్తార‌ని చెబుతున్నారు.

సంకీర్ణంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరి ఎలా వున్నా శివసేన మాత్రం గవర్నర్‌ కోషియారీని తప్పించాలన్న విషయంపై ప‌ట్టుబ‌ట్టిన‌ట్టుగా తెలుస్తోంది.. కాగా, క‌రోనా కారణంగా మూసేసిన ప్రార్థనా స్థలాలను తెరిచే విషయంలో గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ప్రార్థనా స్థలాలను తిరిగి తెరవాలంటూ తమకు కొందరు లేఖలు రాస్తున్నారంటూ గవర్నర్ ప్రభుత్వానికి ఓ లేఖ రాయ‌డం చ‌ర్చ‌గా మారింది.

దీనిపై స్పందించిన సీఎం ఉద్ధ‌వ్.. ఆ లేఖలన్నీ బీజేపీ మద్దతుదారుల నుంచే వచ్చాయంటూ ఆరోప‌ణ‌లు చేశారు.. అయితే, గవర్నర్ కోషియారీ కూడా ఉద్ధవ్‌కు అంతే ఘాటుగా బదులిచ్చారు. హఠాత్తుగా మీరెప్పుడు సెక్యులరిస్టుగా మారిపోయారు? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇలా.. ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తూనే ఉంది.. దీంతో.. రాష్ట్రప‌తి దృష్టికి ఈ వ్య‌వ‌హారాన్ని తీసుకెళ్లాల‌ని.. గ‌వ‌ర్న‌ర్‌ను త‌ప్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

Tags :
|
|

Advertisement