Advertisement

ఆషాడ మాస బోనాలు నేటి నుంచే ప్రారంభం ..

By: Sankar Sun, 12 July 2020 2:54 PM

ఆషాడ మాస బోనాలు నేటి నుంచే ప్రారంభం ..



తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే పండుగ బోనాలు ..ముఖ్యంగా హైదరాబాద్ , సికింద్రాబాద్ లో ఆషాడ మాసంలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు ..అయితే ఈ ఏడాది సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఆలయం ఆషాఢమాస బోనాల శోభను సంతరించుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మంగళహారతి ఇచ్చారు. ఇందుకు సంబంధించి శనివారం సాయంత్రానికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా భక్తులు, సందడి లేకుండానే ఈసారి బోనాలు జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి వల్ల ఎవరినీ అనుమతించడం లేదు. కేవలం అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలోనే ఉత్సవాలు జరగనున్నాయి. పూలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు.

ఆదివారం మంత్రి తలసాని కుటుంబ సభ్యులు తమ నివాసం నుంచి తొలి బోనాన్ని ఆలయం వద్దకు తీసుకువచ్చారు. తొలి బోనం ఆలయం బయట పండితులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సతీమణి స్వర్ణ అందజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ నివాసం నుంచే అమ్మ వారికి ఏటా తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అక్కడి నుంచి ఆలయ ఈఓ, అర్చకులు బోనాన్ని తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు.

అయితే, ప్రత్యక్ష ప్రసారంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు, కరోనా నేపథ్యంలో ఆలయంలోనే నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శనివారం తెలిపారు. ప్రజలంతా ఇళ్లలోనే అమ్మవారికి బోనాలు సమర్పించాలని, ఆలయానికి రావద్దని సూచించారు. శనివారం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి ఆలయం వద్ద బోనాల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

Tags :
|

Advertisement