Advertisement

మధ్యప్రదేశ్‌లో వరద బీభత్సం

By: Dimple Mon, 31 Aug 2020 01:08 AM

మధ్యప్రదేశ్‌లో వరద బీభత్సం

మధ్యప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. మరోవైపు వర్షాల తీవ్రత అధికంగా ఉన్న 12 జిల్లాల్లోని 454 గ్రామాలకు చెందిన 7,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మరో 40 గ్రామాలకు చెందిన 1200 మందిని తరలించేందుకు యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపడుతున్నామన్నారు.

రాష్ట్రంలో తాజా పరిస్థితులను ప్రధాని మోదీకి, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు వివరించినట్లు సీఎం తెలిపారు. పరిస్థితులు అదుపు తప్పడంతో సహాయక చర్యల కోసం భారత వైమానిక దళానికి చెందిన మూడు హెలికాప్టర్లను కేంద్రం పంపించింది. మరో రెండు హెలికాప్టర్ల కోసం కేంద్రాన్ని అభ్యర్థించినట్లు చౌహాన్‌ తెలిపారు. సహాయక చర్యల కోసం ఆర్మీ కూడా రంగంలోకి దిగింది.

వరదల్లో చిక్కుకున్న వారిని యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రానున్న 24 గంటల్లో ఇండోర్‌, ఉజ్జయిన్‌, షాజాపూర్‌, రత్లాం, దేవస్‌, అలిరాజ్‌పూర్‌, మాండసూర్‌, నీమచ్‌ ప్రాంతాల్లో అత్యధిక వర్ష సూచనలు ఉన్నట్లు వాతావారణ శాఖ వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చౌహాన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

ప్రారంభించకుండానే కూలిన వంతెన
సియోని జిల్లాలో వయిన్‌గంగా నదిపై నూతనంగా నిర్మిస్తున్న 150 మీటర్ల పొడవైన వంతెన వరదల దాటికి కొట్టుకుపోయింది. రూ.3.7 కోట్ల వ్యయంతో కడుతున్న ఈ వారధి ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. సెప్టెంబర్‌ 1, 2018లో ప్రారంభించిన వంతెనను అధికారికంగా ఇవాళ్టికి పూర్తి చేయాల్సి ఉంది.

Tags :
|
|

Advertisement