Advertisement

తోలు బంతిలాగ మారిన ఊపిరితిత్తులు

By: chandrasekar Sat, 24 Oct 2020 09:30 AM

తోలు బంతిలాగ మారిన ఊపిరితిత్తులు


కరోనా బాధితుల నుండి రోజుకొక వివరాలు వెలువడుతున్నాయి. కరోనా వైరస్‌ సోకి మరణించిన ఒక రోగి ఊపిరితిత్తులు తోలు బంతి మాదిరిగా గట్టిగా మారాయి. రోగి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన సందర్భంగా వైద్యులు ఈ విషయాన్ని గుర్తించారు. కర్ణాటకకు చెందిన 62 ఏండ్ల వ్యక్తికి కరోనా సోకడంతో బెంగళూరులోని ఆక్స్‌ఫర్డ్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. ఐసొలేషన్‌లో ఉన్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ కుటుంబం అనుమతితో ఆ వ్యక్తి మృతదేహానికి ఆక్స్‌ఫర్డ్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన డాక్టర్‌ దీనేష్‌ రావు నేతృత్వంలో శవ పరీక్ష నిర్వహించారు.

పోస్టుమార్టం నిర్వహించిన ఆ వ్యక్తి ఊపిరితిత్తులను తెరిచి చూడగా తోలు బంతి మాదిరిగా గట్టిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఊపిరితిత్తులలోని గాలి సంచులు చీలిపోయి రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడంతో తోలు బంతి మాదిరిగా మారినట్లు డాక్టర్‌ దీనేష్‌ రావు చెప్పారు. ఈ నెల 10న నిర్వహించిన పోస్టుమార్టం నివేదికను బుధవారం విడుదల చేసినట్లు వెల్లడించారు. మరోవైపు కరోనా రోగి మృతదేహం ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశమున్నదని ఈ సందర్భంగా డాక్టర్‌ దీనేష్‌ రావు గుర్తించారు. కరోనా వల్ల మరణించిన 18 గంటల తర్వాత ఆ వ్యక్తి చర్మం, ముక్కు, గొంతు, నోరు, ఊపిరితిత్తుల ఉపరితలం, వాయు గొట్టం, నాళాల నుంచి నమూనాలను డాక్టర్‌ దీనేష్‌ సేకరించారు.

సేకరించిన ఆ నమూనాలకు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించారు. ముక్కు, గొంతు నుంచి సేకరించిన నమూనాలకు కరోనా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. దీంతో కరోనా రోగి మృతదేహం ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశమున్నదని డాక్టర్‌ దీనేష్‌ రావు తెలిపారు. అయితే ఆశ్చర్యంగా మృతుడి చర్మం నమూనాకు నెగిటివ్‌ ఫలితం వచ్చిందన్నారు. అమెరికా, ఇటలీలో కరోనా రోగుల మృతదేహాలకు నిర్వహించిన శవ పరీక్షకు తన బృందం నిర్వహించిన పొస్టుమార్టం మధ్య వ్యత్యాసం ఉన్నదని ఆయన చెప్పారు. భారత్‌లో కనిపించే వైరస్ జాతులు భిన్నంగా ఉండటమే దీనికి కారణమని డాక్టర్‌ దీనేష్‌ రావు అభిప్రాయపడ్డారు. ఈ రకంగా పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి.

Tags :
|
|

Advertisement