Advertisement

  • వ‌ర‌ద బాధితుల‌కు ప్రముఖ సంస్థలు కోట్లలో విరాళాలు...

వ‌ర‌ద బాధితుల‌కు ప్రముఖ సంస్థలు కోట్లలో విరాళాలు...

By: chandrasekar Wed, 21 Oct 2020 6:33 PM

వ‌ర‌ద బాధితుల‌కు ప్రముఖ సంస్థలు కోట్లలో విరాళాలు...


భారీ వ‌ర్షాల కారణంగా అతలాకుతలమైన హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ప‌లువురు దాత‌లు ముందుకు వ‌స్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు మై హోమ్ సంస్థ రూ. 5 కోట్ల విరాళం ప్ర‌క‌టించింది. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలుగా అండ‌గా నిలుస్తామ‌ని మైహోమ్ సంస్థ భ‌రోసానిచ్చింది.

‘మేఘా’ 10 కోట్లు..

కేసీఆర్‌ పిలుపుమేరకు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థ స్పందించింది. సీఎం సహాయ నిధికి 10 కోట్ల విరాళం ప్రకటించింది. సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంపా నాగేందర్‌, జనరల్‌ సెక్రటరీ మోహన్‌రెడ్డి ప్రకటించారు.

సీఎస్ఆర్ డెవ‌ల‌ప‌ర్స్ రూ. 10 ల‌క్ష‌లు...

సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, సీఎస్ఆర్ డెవ‌ల‌ప‌ర్స్ ఎండీ చెరుకు సుధాక‌ర్ రెడ్డి.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు రూ. 10 ల‌క్ష‌ల చెక్కును మంత్రి కేటీఆర్‌కు సుధాక‌ర్ రెడ్డి అంద‌జేశారు.

జీహెచ్ఎంసీ ప్ర‌జాప్ర‌తినిధులు రెండు నెల‌ల జీతాలు విరాళం..

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో న‌ష్ట‌పోయిన హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముందుకు వ‌చ్చారు. త‌మ రెండు నెల‌ల జీతాన్ని ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని ప్ర‌జాప్ర‌తినిధులు భరోసా ఇచ్చారు.

ఢిల్లీ ప్ర‌భుత్వం రూ. 15 కోట్లు.. త‌మిళ‌నాడు రూ. 10 కోట్లు..

ఇక ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా తెలంగాణ‌కు అండ‌గా నిలిచాయి. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 10 కోట్లు విరాళం ప్ర‌క‌టించ‌గా.. తాజాగా ఢిల్లీ ప్ర‌భుత్వం ముందుకొచ్చింది. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ పునారావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరుఫున రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని ప్రకటించారు. రూ.15 కోట్ల సాయం ప్రకటించిన కేజ్రీవాల్ కు తెలంగాణ ప్రజల తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కేజ్రీవాల్ కు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. కేజ్రీవాల్ ఎంతో ఉదారత చాటుకుని అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Tags :
|
|

Advertisement