Advertisement

కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందున్నదేశాలు

By: chandrasekar Thu, 16 July 2020 5:29 PM

కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందున్నదేశాలు


కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఓ వైపు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ టీకాను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. కరోనా వ్యాక్సిన్ తయారీలో తామే ముందున్నామంటూ కొన్ని దేశాలు ఎప్పటికప్పుడు ప్రకటనలు సైతం గుప్పిస్తున్నాయి. ఏయే దేశాల్లో మానవులపై వ్యాక్సిన్ ప్రయోగాలు ఏ దశలో ఉన్నాయనే వివరాలను పరిశీలిద్దాం.

ఇండియాలో కరోనా వాక్సిన్

భారత్ బయోటెక్ ఇండియాలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో దూసుకుపోతోంది. భారత్ బయోటెక్ ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ షురూ చేసింది. ఐసిఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాక్సిన్ వ్యాక్సిన్‌పైనే ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

భారత్ బయోటెక్‌తో పాటు జైడస్ క్యడిలా కూడా కరోనా కి వ్యాక్సిన్‌ని కనిపెట్టే పనిలో బిజీగా ఉంది. ఇటీవలే ప్రీ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ సంస్థ.. తాజాగా హ్యూమన్ ట్రయల్స్‌కి కూడా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ( CDSCO ) నుంచి అనుమతి తీసుకుంది. ఇండియాలో కరోనా వ్యాక్సిన్‌ తయారీ రేసులో భారత్ బయోటెక్ తర్వాత రెండో స్థానంలో ఉన్న కంపెనీ కూడా ఇదే.

అమెరికాలో కరోనా వ్యాక్సిన్

అమెరికాలో కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో ముందున్నామని చెబుతున్న మొడర్నా బయోటెక్ సంస్థ... జూలై 27 నుంచి తుది దశ ప్రయోగాల్లో బిజీ అవుతామని పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల ఫలితాలను తాజాగా ఓ జర్నల్‌కి వెల్లడించిన మొడర్నా... 3వ దశ ప్రయోగాల కోసం 30,000 మందిని నియమించుకుంటున్నట్టు తెలిపింది.

leading,countries,corona,vaccine,development ,కరోనా , వ్యాక్సిన్ , తయారీలో,  ముందున్న, దేశాలు


రష్యాలో కరోనా వ్యాక్సిన్

రష్యాలో కరోనా వ్యాక్సిన్ తయారీలో ఒకే ఒక సంస్ధ మున్ముందుకు దూసుకుపోతోంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి జమలీ నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడిమాలజీ అండ్ మైక్రోబయాలజీ వాళ్లు తయారు చేస్తోన్న వ్యాక్సిన్ జూన్ 18నే తొలి దశ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించింది.

బ్రిటన్‌లో కరోనా వ్యాక్సిన్

బ్రిటన్‌లో యాంటీ కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీలో రెండు సంస్థలు ముందంజలో ఉన్నాయి. అందులో ఒకటి ఆస్ట్రాజెనికాతో కలిసి ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ వాళ్లు రూపొందిస్తున్న వ్యాక్సిన్ కాగా మరొకటి లండన్‌కి చెందిన ఇంపీరియల్ కాలేజ్ తయారు చేస్తోన్న వ్యాక్సిన్. ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ ప్రస్తుతం హ్యూమన్ ట్రయల్స్‌లో 3వ దశలో ఉండగా ఇంపీరియల్ కాలేజీ వాళ్లు తయారు చేస్తోన్న వ్యాక్సిన్ 1,2వ ఫేజ్ ట్రయల్స్ జూన్ 15నే ప్రారంభమయ్యాయి.

చైనాలో కరోనా వ్యాక్సిన్

చైనాలో కరోనా వ్యాక్సిన్ తయారీ విషయానికొస్తే చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ అనే సంస్థ బ్రెజిల్‌లో వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేస్తోంది. 3వ దశ ట్రయల్స్ ప్రారంభిస్తున్న ఈ సంస్థ కూడా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్న సంస్థల్లో ఒకటిగా ఉంది. బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో కలిసి కెన్సినో అనే బయోటెక్నాలజీ సంస్థ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ కూడా ప్రస్తుతం హ్యూమన్ ట్రయల్స్‌లో ఫేస్ 2లో ఉంది. వుహాన్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి సినోఫార్మ్ సంస్థ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ సైతం 2 దశలో ఉంది. ఇదే సినో‌ఫామ్ సంస్థ బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రోడక్ట్స్ సంస్థతో కలిసి మరో వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం దీని ట్రయల్స్ కూడా రెండో దశలోనే ఉన్నాయి.

Tags :
|

Advertisement