Advertisement

  • అప్పుల పట్టికలో చివ‌ర‌న...రెండున్నర రెట్లు రాష్ట్ర ఆదాయం పెరిగింది: మ‌ంత్రి హ‌రీశ్‌రావు

అప్పుల పట్టికలో చివ‌ర‌న...రెండున్నర రెట్లు రాష్ట్ర ఆదాయం పెరిగింది: మ‌ంత్రి హ‌రీశ్‌రావు

By: chandrasekar Tue, 15 Sept 2020 5:21 PM

అప్పుల పట్టికలో చివ‌ర‌న...రెండున్నర రెట్లు రాష్ట్ర ఆదాయం పెరిగింది: మ‌ంత్రి హ‌రీశ్‌రావు


రాష్ట్ర ప్ర‌యోజ‌నాల మేర‌కే అప్పులు తెస్తున్న‌ట్లు రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. తెలంగాణ ఫిసికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ స‌వ‌ర‌ణ‌ బిల్ 2020ని మంత్రి నేడు శాస‌న‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి కుటుంబడింది. ఆర్థిక అభివృద్ధి జ‌ర‌గాలంటే ప్రజల చేతిలో డబ్బులు ఉండాలి. అలా ఉండాలంటే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద కొన్ని షరతులతో కూడి, కొన్ని షరతులు లేకుండా 2 శాతం ఎఫ్ఆర్‌బీఎంను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి సాధారణంగా మనకు 3 శాతం అప్పు తీసుకునే అవకాశం ఉంది. దాన్ని మరో 2 శాతానికి పెంచుతూ,ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం 5 శాతం రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అప్పులను చూసే ముందు రాష్ట్ర అప్పులు, ఆదాయాన్ని కలిపి చూడాల‌న్నారు. మన రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధి 2014కు ముందు రూ. 4 లక్షల 52 వేల కోట్లు అయితే నేడు రూ. 11 లక్షల 5 వేల 349 కోట్లు అన్నారు. రెండున్నర రెట్లు రాష్ట్ర ఆదాయం పెరిగిన‌ట్లు తెలిపారు. కేవలం అప్పు పెరుగుతుందని చెబుతున్నారు. పెరిగిన ఆదాయాన్నిచూడాలని అన్నారు.

త‌మ ప్ర‌భుత్వం రోడ్లు వేయవద్దు, ప్రాజెక్టులు కట్టవద్దు, రైతులకు మద్ధతు యివొద్దు, మంచి నీరు ఇవ్వద్దు అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ నేతల తీరు అని అన్నారు. ప్రతిపక్షం కనుక విమర్శించాలని చూడకుండా వాస్తవాలను చూడాల‌న్నారు. మన రాష్ట్ర వృద్ధి రేటు 12.6 శాతంగా ఉంది. దేశం జీడీపీ 3 శాతానికి పడిపోతే నేడు మన తెలంగాణ దేశంలో మరే రాష్ట్రం సాధించనంత వృద్ధి రేటు సాధించిందని పేర్కొన్నారు. ఇది క్యాపిటల్ ఎక్సెపెండిచర్ మీద ఖర్చు పెట్టడం వల్ల సాధ్యమైన‌ట్లు చెప్పారు. దేశమంతా మన విధానాన్ని అభినందిస్తుందని తెలిపారు. RBI నివేదిక‌ ప్రకారం.. 29 రాష్ట్రాల అప్పుల నివేదిక తీస్తే మన రాష్ట్రం చివరి నుండి రెండో స్థానంలో అంటే 28వ స్తానంలో ఉంది. మన కన్నా కింద మహారాష్ట్ర ఉంది. తెలంగాణ 17 మహారాష్ట్ర 16.9 శాతంగా ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలయిన పంజాబ్ అప్పుల శాతం 39.9 శాతం, రాజస్థాన్ 33.6 శాతంగా ఉంది. మన రాష్ట్రం చిట్టచివరి స్థానంలో ఉంద‌న్నారు. అప్పుల విషయంలో మిగతా రాష్ట్రాలతో మనం మెరుగైన స్థానంలో ఉన్నాం. మనకు అప్పులు ఇవ్వడానికి బ్యాంకులే ముందుకు వస్తున్నాయి. కారణం రీ పేమెంట్ కెపాసిటీ మన విధానాలు, పని తీరుకు నిదర్శనం అన్నారు. రాష్ట్ర ప్రజల, రైతుల ప్రయోజనాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటున్న‌ట్లు మంత్రి తెలిపారు

Tags :

Advertisement