Advertisement

జాతీయ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్..

By: Anji Thu, 17 Sept 2020 12:06 PM

జాతీయ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్..

ఇవాళ సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు విమోచన దినోత్సవం జరుపుకుంటారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం ఇదే రోజు స్వాతంత్య్రం పొందింది. భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం అయిన రోజు. అయితే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జెండాను ఆవిష్కరించారు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు.

హైదరాబాద్ అటు ఇండియాలో కాని, ఇటు పాకిస్తాన్‌లో కాని కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. దీంతో అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ పరిస్థితిని ముందే ఊహించి నిజాం నవాబు పాకిస్తాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితని ఆశ్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో నిర్వహించింది.

హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్య్రం వచ్చి హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. అందుకే సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు.

Tags :

Advertisement