Advertisement

  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఘోరంగా ఓడిన కోల్ కతా నైట్ రైడర్స్

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఘోరంగా ఓడిన కోల్ కతా నైట్ రైడర్స్

By: chandrasekar Tue, 13 Oct 2020 10:09 AM

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఘోరంగా ఓడిన కోల్ కతా నైట్ రైడర్స్


ఐపీల్ 2020 లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో కోల్ కతా నైట్ రైడర్స్ ఘోరమైన అపజయాన్ని చవి చూసింది. ఐపీఎల్‌-13లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదిరిపోయే ఆటతీరుతో దుమ్మురేపుతున్నది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన కోహ్లీసేన 82 పరుగుల తేడాతో కోల్‌కతాను ఓడించింది. భీకర ఫామ్‌లో ఉన్న బెంగళూరు ముందుగా బ్యాటింగ్‌కు దిగి 194 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో కోల్‌కతా బెంగళూరు బౌలర్ల ధాటికి కోల్‌కతా 9 వికెట్లు కోల్పోయి 112 పరుగులకే చతికిలపడింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(34: 25 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(1)తో సహా మిగతా బ్యాట్స్‌మెన్‌ టామ్‌ బాంటన్‌(8), నితీశ్‌ రాణా(9), ఇయాన్‌ మోర్గాన్‌(8), ఆండ్రూ రస్సెల్‌(16) దారుణంగా విఫలమయ్యారు. ప్రత్యర్థి స్కోరు ఎక్కువగా ఉండడంతో లక్ష్య ఛేదనలో కోల్ కతా తొందరగా వికెట్లను పోగొట్టుకుంది.

బెంగళూరు బౌలర్లు పటిష్ఠ కోల్‌కతాను అద్భుతంగా కట్టడి చేశారు. డెత్‌ ఓవర్లలో బెంగళూరు కీలక వికెట్లు తీయడంతో పాటు పరుగులను కూడా నియంత్రించింది. బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌(2/20), క్రిస్‌ మోరీస్‌(2/17) చెరో రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు ఏబీ డివిలియర్స్ ‌(73 నాటౌట్‌: 33 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లు) వీరవిహారం చేయడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఆరంభంలో అరోన్‌ ఫించ్‌ (47: 37 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌ ), దేవదత్‌ పడిక్కల్‌(32: 23 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) దూకుడుకు తోడు ఆఖర్లో డివిలియర్స్‌ మెరుపులు తోడు కావడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (33 నాటౌట్:‌ 28 బంతుల్లో ఫోర్‌) ఫర్వాలేదనిపించాడు. ఇక్కడ మ్యాచ్ పూర్తిగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలోకి వెళ్ళింది.

Tags :
|
|

Advertisement