Advertisement

  • కోహ్లి కీలక తప్పిదాలు.. ఆర్సీబీ ఓటమికి కారణాలు...

కోహ్లి కీలక తప్పిదాలు.. ఆర్సీబీ ఓటమికి కారణాలు...

By: chandrasekar Fri, 16 Oct 2020 12:23 PM

కోహ్లి కీలక తప్పిదాలు.. ఆర్సీబీ ఓటమికి కారణాలు...


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ల నుంచి సహకారం లభించలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేధించే క్రమంలో పంజాబ్ ప్లాన్ ప్రకారం వ్యవహరించింది. చివరి రెండు ఓవర్లలో బెంగళూరు బౌలర్లు పుంజుకున్నప్పటికీ నికోలస్ పూరన్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి పంజాబ్‌ను గెలిపించాడు. ఈ సీజన్లో పంజాబ్‌కు ఇది రెండో విజయం కాగా బెంగళూరుకు మూడో ఓటమి.

రాయల్ ఛాలెంజర్స్ తప్పిదాలు

ఆర్సీబీ ప్రధాన బలం టాప్ ఆర్డర్ బ్యాటింగ్. పడిక్కల్, ఫించ్ ఓపెనర్లు బరిలో దిగితే తర్వాత కోహ్లి, డివిలియర్స్ క్రీజ్‌లోకి వస్తారు. కానీ పంజాబ్‌తో మ్యాచ్‌లో బెంగళూరు డివిలియర్స్‌ను ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు పంపింది. మణికట్టు స్పిన్నర్లను డివిలియర్స్ సరిగా ఎదుర్కోలేడని భావనతోపాటు ఆఖరి ఓవర్లలో అతడు క్రీజ్‌లో ఉంటే భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచొచ్చని ఆర్సీబీ భావించింది. ఏబీడీ క్రీజులో కుదురుకుంటే ఎంతటి ప్రమాదకర బౌలర్‌కైనా చుక్కలు చూపిస్తాడనే విషయాన్ని మర్చిపోయారు. లోయర్ ఆర్డర్‌లో ఆడిన డివిలియర్స్ కుదురుకోకుండానే 2 పరుగుల వద్ద ఔటయ్యాడు.

పవర్ ప్లే 6 ఓవర్లలో ఆర్సీబీ 57 రన్స్ చేసింది. కానీ ఆ తర్వాతి 8 ఓవర్లలో కేవలం 46 పరుగులు మాత్రమే చేసింది. దీంతో షార్జాలోనూ బెంగళూరు 171 పరుగులతోనే సరిపెట్టుకుంది. ఇదే పిచ్ మీద 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ చేధించింది. దీంతో 172 పరుగుల లక్ష్యం పంజాబ్‌కు అంత కష్టమేం కాలేదు. కోహ్లి, ఇతర బ్యాట్స్‌మెన్ మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడి ఉంటే ఆర్సీబీ మరో 15-20 పరుగులు అదనంగా చేసి ఉండేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. ఇక బౌలింగ్ రొటేషన్ విషయంలో విరాట్ కోహ్లి అనేక తప్పిదాలు చేశాడు. పవర్ ప్లేలో ప్రమాదకారి అయిన వాషింగ్టన్ సుందర్‌ను తొలి 6 ఓవర్లలో బౌలింగ్‌కు దింపలేదు. చివరి ఐదు ఓవర్లలో పంజాబ్ విజయానికి 47 పరుగులు అవసరమైన దశలో మహ్మద్ సిరాజ్‌ను బౌలింగ్ దించిన కోహ్లి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ ఓవర్లో సిరాజ్ 20 పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఉడానా రెండు ఓవర్లే బౌలింగ్ చేయగా... చాహల్ మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడు. గేల్‌ బ్యాటింగ్‌కు దిగిన తర్వాత చాహల్‌కు కోహ్లి బౌలింగ్ ఇవ్వలేదు. ఆఖరి ఓవర్లో 2 పరుగులు చేస్తే పంజాబ్ గెలుస్తుందనగా.. చాహల్‌‌ను బౌలింగ్‌కు దింపాడు.

Tags :
|
|

Advertisement