Advertisement

వన్డే సిరీస్ కోల్పోయిన కోహ్లీ సేన....

By: chandrasekar Mon, 30 Nov 2020 12:41 PM

వన్డే సిరీస్ కోల్పోయిన కోహ్లీ సేన....


ఆసీస్‌ తో కోహ్లీ సేన వన్డే సిరీస్‌ చేజార్చుకుంది. పసలేని బౌలింగ్‌, పేలవ ఫీల్డింగ్‌తో భారీ మూల్యం చెల్లించుకుంది. తొలి వన్డే ఓటమి అనంతరం పరాజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటేనే విజయాలు సొంతమవుతాయన్న విరాట్‌ కోహ్లీ మాటలను ఏమాత్రం ఆచరించి చూపని టీమ్‌ఇండియా మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను ఆస్ట్రేలియాకు ఇచ్చేసింది. తొలి వన్డే లాగా సాగిన రెండో వన్డేలోనూ టీమ్‌ఇండియాకు పరాజయం తప్పలేదు. గత మ్యాచ్‌లో దంచికొట్టి భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా ఈ సారి అంతకుమించి విధ్వంసంతో కొండంత లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేక భారత్‌ ఓటమి పాలైంది. ఆదివారం ఇక్కడ జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా 51 పరుగుల తేడాతో గెలుపొంది. మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ చేజిక్కించుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' స్టీవ్‌ స్మిత్‌ (64 బంతుల్లో 104; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) టీమ్‌ఇండియాపై హ్యాట్రిక్‌ సెంచరీతో రెచ్చిపోతే.. డేవిడ్‌ వార్నర్‌ (83; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), లబుషేన్‌ (70; 5 ఫోర్లు), మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 63 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (60; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 4 వికెట్లకు 389 పరుగులు చేసింది. అనంతరం రికార్డు స్థాయి ఛేదనలో కోహ్లీ సేన 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (89; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), లోకేశ్‌ రాహుల్‌ (76; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకట్టుకున్నా.. మిగిలిన వాళ్లు విఫలమవడంతో టీమ్‌ఇండియాకు పరాజయం తప్పలేదు.

టాస్‌ గెలిచిన ఫించ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవడంతోనే భారత్‌ పని అయిపోయింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కంగారూలకు కళ్లెం వేయలేక తీవ్రంగా కష్టపడింది. ఓపెనర్లు వార్నర్‌, ఫించ్‌ తొలి వికెట్‌కు 142 పరుగులు జోడించి బలమైన పునాది వేయగా.. ఆ తర్వాత స్మిత్‌, లబుషేన్‌, మ్యాక్స్‌వెల్‌ భారత బౌలర్లను ఆటాడుకున్నారు. ఏమాత్రం పసలేని బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఆసీస్‌ టాపార్డర్‌ భారీ స్కోరు నమోదు చేసింది. భారీ టార్గెట్‌ ఛేజింగ్‌లో భారత్‌కు శుభారంభం దక్కలేదు. మయాంక్‌ అగర్వాల్‌ (28), శిఖర్‌ ధవన్‌ (30) పది ఓవర్ల లోపే పెవిలియన్‌ దారి పట్టారు. దీంతో ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత కోహ్లీ భుజాలపై పడింది. అతడు మూడో వికెట్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ (38)తో కలిసి 93 పరుగులు జోడించడంతో ఇక కోలుకున్నట్లే అనిపించినా.. స్మిత్‌ సూపర్‌ క్యాచ్‌తో అయ్యర్‌ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత రాహుల్‌ అండగా కోహ్లీ పోరాడినా.. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. ఈ దశలో హెన్రిక్స్‌ కండ్లు చెదిరే క్యాచ్‌తో కోహ్లీ డగౌట్‌ చేరగా.. రాహుల్‌ ఉన్నంతసేపు ధాటిగా ఆడేందుకు యత్నించాడు. విజయానికి 6 ఓవర్లలో 99 పరుగులు చేయాల్సిన దశలో హార్దిక్‌ పాండ్యా (28), రవీంద్ర జడేజా (24) కాస్త ఆశలు రేపినా.. పాట్‌ కమిన్స్‌ వరుస బంతుల్లో ఈ ఇద్దరిని ఔట్‌చేసి భారత్‌ పరాజయాన్ని ఖాయం చేశాడు.

‘కీలక సమయంలో బౌలింగ్‌ చేస్తా’అని తొలి వన్డే అనంతరం చెప్పిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. తాజా మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి ఓ వికెట్‌ తీశాడు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారిస్తుండటంతో.. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు సారథి కోహ్లీ.. పాండ్యాకు బంతినప్పగించగా.. రనప్‌ మార్చుకున్న హార్దిక్‌.. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టాడు. మ్యాచ్‌లు నెగ్గాలంటే క్యాచ్‌లు పట్టాలనేది క్రికెట్‌లో ప్రాథమిక సూత్రం. ఈ మ్యాచ్‌లో నమ్మశక్యం కాని రెండు క్యాచ్‌లు పట్టిన ఆసీస్‌ ఆటగాళ్లు అదుర్స్‌ అనిపించారు. హెన్రిక్స్‌ బౌలింగ్‌లో అయ్యర్‌ కొట్టిన బంతిని స్మిత్‌ అమాంతం గాల్లోకి ఎగిరి అందుకుంటే.. ఆ తర్వాత సెంచరీకి చేరువైన విరాట్‌ కోహ్లీని హెన్రిక్స్‌ సూపర్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ బాటపట్టించాడు. ఈ రెండు క్యాచ్‌లు మ్యాచ్‌ గమనాన్ని మార్చేశాయి.

Tags :
|
|
|
|

Advertisement