Advertisement

  • తిరుమలలో డిక్లరేషన్‌పై కొడాలి నాని ఈ హాట్ కామెంట్స్

తిరుమలలో డిక్లరేషన్‌పై కొడాలి నాని ఈ హాట్ కామెంట్స్

By: chandrasekar Mon, 21 Sept 2020 11:08 AM

తిరుమలలో డిక్లరేషన్‌పై కొడాలి నాని ఈ హాట్ కామెంట్స్


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ సమర్పించాలన్న వాదన మీద మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు డిక్లరేషన్‌ను తీసేయాలని డిమాండ్ చేశారు. ఈ డిక్లరేషన్‌ను తీసుకొచ్చింది రాజకీయ పార్టీలేనని నాని అన్నారు. 'వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా తిరుమల శ్రీవారిని దర్శిచుకున్నారు. ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు డిక్లరేషన్ ఎందుకు అడగలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా వైఎస్ జగన్ తిరుమల వెళ్లారు. ప్రతిపక్ష నేతగా, పాదయాత్ర చేసే ముందు, యాత్ర చేసిన తర్వాత కూడా తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకున్నారు. అప్పుడు సీఎంగా చంద్రబాబే ఉన్నారు కదా. అప్పుడెందుకు అడగలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తుంటే ఇప్పుడు డిక్లరేషన్ అవసరం ఏముంది?. అయినా డిక్లరేషన్ ఇవ్వాలని టీటీడీ బోర్డు అడగడం లేదు. హిందూ మత సంస్థలు అడగడం లేదు. కొందరు బీజేపీ, టీడీపీ నేతలు మాత్రమే అడుగుతున్నారు.’ అని కొడాలి నాని అన్నారు.

రాష్ట్రంలోని ఏ ఆలయంలో కూడా లేని డిక్లరేషన్ తిరుమలలో మాత్రమే ఎందుకు అని కొడాలి నాని ప్రశ్నించారు. ‘రాజకీయ నేతగా నేను అనేక మసీదులకు వెళ్లా. నన్నెప్పుడూ డిక్లరేషన్ అడగలేదు. అలాగే, చర్చిలకి వెళ్లా సంతకం పెట్టమని నన్నెవరూ అడగలేదు. ఏ గుళ్లోనూ అడగలేదు. శ్రీశైలంలో అక్కర్లేదు. దుర్గమ్మ గుడికి వెళ్తే అక్కర్లేదు. తిరుపతిలో ఎందుకు పెట్టారు. అక్కడా తీసేయాలి. ’ అని కొడాలి నాని డిమాండ్ చేశారు. ఇలాంటి రూల్స్ వల్లే దేశంలో ఈ పరిస్థితి వచ్చిందని కొడాలి నాని అన్నారు. వేరే మతం వాళ్లు వెంకటేశ్వరస్వామిని నమ్మి గుడికి వెళ్తే సంతకం పెట్టకపోతే ఆ గుడి అపవిత్రం అవుతుందా ? అని మంత్రి ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో ఆలయాలకు సంబంధించి జరుగుతున్న ఘటనల వెనుక టీడీపీ ఉందని కొడాలి నాని అనుమానం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ చేయిస్తున్నారు. కొందరు నియోజకవర్గ ఇన్ చార్జిలు, కొందరు టీడీపీ కార్యకర్తలు ఉన్నారని చెబుతున్నారు. వారిపై కేసు పెట్టి, చంద్రబాబును అరెస్టు చేయడానికి ఓ బృందాన్ని హైదరాబాద్ పంపిస్తే, ఇక్కడ వారి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను ఎవరినైనా అరెస్టు చేస్తే జగన్ ఉద్దేశపూర్వకంగా తమను కేసుల్లో ఇరికిస్తున్నారంటూ అర్ధరాత్రి 11.30 వరకు జడ్జిల నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చుకుంటారు.’ అని కొడాలి నాని ఆరోపించారు. హిందూ ధర్మానికి తామే ఛాంపియన్స్ అని చెప్పుకోవడానికి టీడీపీ, బీజేపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయని నాని వ్యాఖ్యానించారు.

Tags :

Advertisement