Advertisement

  • గణేష్ ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఖైరతాబాద్ ధన్వంతరి గణనాధుడు

గణేష్ ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఖైరతాబాద్ ధన్వంతరి గణనాధుడు

By: Sankar Fri, 21 Aug 2020 09:47 AM

గణేష్ ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఖైరతాబాద్ ధన్వంతరి గణనాధుడు


ఆరోగ్య ప్రధాతగా భక్తులకు దర్శనమిచ్చేందుకు ఖైరతాబాద్‌ గణనాథుడు ముస్తాబవుతున్నాడు. కరోనాను అంతమొందించేందుకు శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతిగా భక్తులకు సాక్షాత్కరించనున్నారు. 1954లో ఒక్క అడుగుతో మొదలై 62అడుగుల ఎత్తు వరకు స్వామి వారు విరాఠస్వరూపుడై దర్శనమిచ్చారు.

అయితే ఖైరతాబాద్‌ గణేశుడి చరిత్రలో తొలిసారిగా తొమ్మిది అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. ప్రస్తుతం విగ్రహం రంగులద్దుకొని సిద్ధం కాగా, నేడు సాయంత్రం 4గంటలకు శిల్పి నగేశ్‌ తన స్వహస్తాలతో స్వామి వారికి నేత్రాలను అలంకరిస్తారు. అలాగే ఈ ఏడాది స్వామి వారికి మియాపూర్‌కు చెందిన ఓ భక్తుడు వంద కేజీల లడ్డును సమర్పిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

ఖైరతాబాద్‌ గణేశుడితో రాష్ట్ర మాజీ గవర్నర్‌ నరసింహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నర్‌గా పనిచేసినన్ని సంవత్సరాలు ఖైరతాబాద్‌ గణేశుడికి తొలిపూజ నిర్వహించే వారు. ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత రాష్ట్ర గవర్నర్‌గా డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఆ ఆనవాయితీని కొనసాగించాలని సంకల్పించింది. గవర్నర్‌ను తొలి పూజ కోసం ఆహ్వానిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు వివరించారు.

కొవిడ్‌ నేపథ్యంలో ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం సామూహిక పూజలు, దర్శనాలు నిర్వహించవద్దని కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో భక్త జన కోటికి ఆరాధ్య దైవంగా కొలువబడుతున్న ఖైరతాబాద్‌ గణేశుడిని నేరుగా దర్శించుకునే భాగ్యం ఈ ఏడాది ఉండదు. భక్తులను నిరాశపర్చవద్దనే ఉద్దేశ్యంతో ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరుగా స్వామి వారిని ఆన్‌లైన్‌లో దర్శించుకునే వీలు కల్పిస్తున్నారు. అంతేకాకుండా స్వామి వారికి ప్రత్యక్షంగా ఆన్‌లైన్‌లోనే ఉచితంగా పూజలు నిర్వహించే వీలు కల్పిస్తున్నారు

Tags :
|

Advertisement