Advertisement

టోపీ పెడితే కెసిఆర్‌ నిజాం నవాబే!

By: Dimple Wed, 09 Sept 2020 09:09 AM

టోపీ పెడితే కెసిఆర్‌ నిజాం నవాబే!

టోపీ పెడితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అచ్చం ఎనిమిదో నిజాంలా ఉంటాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఎద్దేవా చేశారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి యాత్ర ప్రారంభించారు. అలాగే.. సిద్దిపేట జిల్లా బైరాన్‌పల్లి, కూటిగ్లు గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్తూపం, బురుజు వద్ద, వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు డీఎన్‌ఏ టెస్ట్‌ చేస్తే ఆయన నిజాం వారసుడా కాదా అని బయటపడుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా విమోచన దినాన్ని అధికారికంగా జరపడం లేదని మండిపడ్డారు. ఆయన తలకాయలో మైనార్టీ ఓటు బ్యాంకు నాటుకు పోయిందని విమర్శించారు.

రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో కుమ్మక్కై తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులను, వారి త్యాగాలను కేసీఆర్‌ విస్మరించారని విమర్శించారు. మజ్లిస్‌ పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ఉద్యమకారుల త్యాగాలకు విలువ లేకుండా చేశారని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని బండి పిలుపునిచ్చారు.

రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసిన వారి నిజమైన చరిత్రను కనుమరుగు చేసిన కేసీఆర్‌.. తన కుటుంబ చరిత్రను రాబోయే రోజులకు అందించాలన్న కుట్ర, కుతంత్రాలతో సెప్టెంబర్‌ 17న విమోచన దినం జరపడం లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పతనం తప్పదని ఆయన హెచ్చరించారు.

Tags :
|
|
|

Advertisement