Advertisement

కన్నడ టీవీ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య

By: chandrasekar Thu, 09 July 2020 1:23 PM

కన్నడ టీవీ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య


కర్ణాటకలోని మాండ్యలో ఉన్న తన ఇంట్లో ప్రముఖ కన్నడ టీవీ నటుడు సుశీల్ గౌడ మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. సుశీల్ గౌడ వయసు 30 సంవత్సరాలు. సుశీల్ అకాలమరణం కన్నడ సినిమా, టీవీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది.

సుశీల్ మరణాన్ని ఆయన శ్రేయోభిలాసులు, స్నేహితులు, సహచర నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుశీల్ నటుడిగానే కాకుండా ఫిట్‌నెస్ ట్రైనర్‌గానూ పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దునియా విజయ్ హీరోగా వస్తోన్న ‘సలగ’ సినిమాలో సుశీల్ పోలీసు అధికారి పాత్ర పోషించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

కన్నడ సీరియల్ ‘అంతపుర’లో సుశీల్ హీరోగా నటించారు. ఈ సీరియల్‌తో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్‌లో నటించిన నటి అమితా రంగనాథ్ సుశీల్ ఆత్మహత్యపై స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘సుశీల్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. ఆయన ఇకలేరన్న విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన చాలా మంచి వ్యక్తి. మృధు స్వభావి. ఎప్పుడూ కూల్‌గా ఉంటారు. ఆయన మన నుంచి ఇంత త్వరగా వెళ్లిపోవడం చాలా బాధాకరం. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇంకా ఎంతో ఎత్తుకు వెళ్లగల ప్రతిభ ఉన్న ఆర్టిస్ట్ సుశీల్’’ అని అమిత పేర్కొన్నారు.

అలాగే, సుశీల్ మృతిపై ‘అంతపుర’ డైరెక్టర్ అరవింద్ కౌశిక్ ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. సుశీల్ మరణం బాధాకరమన్నారు. సుశీల్ ఆత్మహత్య చేసుకున్న వార్త తెలిసిన తరవాత హీరో దునియా విజయ్ కూడా ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. కన్నడలో ఆయన పోస్ట్ చేశారు. ‘‘నేను ఆయన్ని మొదటిసారి చూసినప్పుడు హీరో మెటీరియల్ అని అనిపించింది. మేం చేసిన సినిమా విడుదలకాక ముందే ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోవడం బాధాకరం. సమస్య ఏదైనా కానీ ఆత్మహత్య పరిష్కారం కాదు. ఇండస్ట్రీలో వరుస మరణాలు ఈ ఏడాది ఆగవేమో అనిపిస్తోంది. ప్రస్తుతం జనాల్లో కరోనావైరస్ భయమొక్కటే కాదు, సంపాదన లేదనే బాధతో మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. ఈ సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది’’ అని దునియా విజయ్ తెలిపారు.

Tags :

Advertisement