Advertisement

జడ్జి రామకృష్ణ భూమి కబ్జా

By: Dimple Tue, 18 Aug 2020 00:12 AM

జడ్జి రామకృష్ణ భూమి కబ్జా

హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య నియంత్రణ-పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య ఇటీవల ఫోన్‌ చేయగా తీయనందుకు తనపైన, తన కుటుంబసభ్యులపైన కక్షసాధింపు చర్యలు మొదలయ్యాయని దళిత జడ్జి ఎస్‌.రామకృష్ణ వెల్లడించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో తన నివాసం పక్కనే ఉన్న తమ భూమిని కబ్జా చేయడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ప్రయత్నించారని ఆరోపించారు. తన తమ్ముడిని పోలీసు స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి.. ఎన్‌కౌంటర్‌ చేస్తామని కూడా బెదిరించారని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లిన నా తమ్ముడు రామచంద్ర అన్ని డాక్యుమెంట్లతో వెళ్లాడు. ఆ డాక్యుమెంట్లను పక్కనపెట్టేసి.. మీ అన్న ఎక్కడున్నాడంటూ ఎస్సై అక్రమంగా స్టేషన్‌లో నిర్బంధించి, హింసించారు. ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరించారు. ఓనరు మీ అన్న కాబట్టి ఎక్కడున్నాడో ఆయన్నే స్టేషన్‌కు రమ్మనమని చెప్పు.. లేదంటే నీపైనా కేసు పెడతామని బెదిరించారు.


నేను ఎస్పీకి, డీఐజీకి ఫోన్‌చేసి చెప్పాను. ఆ తర్వాత నీకేం కాదు... ఇంటికెళ్లిపో అని నా తమ్ముడికి చెప్పారంట! డీఎస్సీ ఎంక్వైరీకి వస్తాడు.. నువ్వక్కడే కూర్చోమని నేను తమ్ముడికి చెప్పాను. జస్టిస్‌ ఈశ్వరయ్య నాకు నాలుగు సార్లు ఫోన్‌ చేస్తే తీయనందుకు ఆ ఎస్సై నా కుటుంబ సభ్యులను హింసిస్తున్నాడు’ అని తెలిపారు. తన ఫోన్‌కు బగ్‌ పెట్టారని.. దాంతో ఎస్సీతో, డీఐజీతో మాట్లాడుతుంటే ఫోన్‌ హ్యాంగ్‌ అయిపోయిందని చెప్పారు. తాను కొన్న భూమిని కబ్జా చేస్తున్నారని.. చుట్టూ బండలు వేస్తున్నారని.. వారంతా పెద్దిరెడ్డి మనుషులేనని.. పోలీసులు దగ్గరుండి చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. 2012లో ఒకటిన్నర ఎకరం కొన్నానని.. అయితే ఆ భూమి తమదని కొందరు గొడవకు వచ్చారని.. దాంతో డబ్బులిచ్చి కొంత భాగం మాత్రమే రిజిస్టర్‌ చేయించుకున్నానని.. భూమి తమదన్నవారు డాక్యుమెంట్లతో వస్తే డబ్బులిచ్చి రిజిస్టర్‌ చేయించుకుంటామన్నారని.. కానీ రాలేదని తెలిపారు. నాగరాజు అనే వ్యక్తి మోసం చేసి ఈ భూమి అంటగట్టారని.. ఇప్పుడు అతడే దగ్గరుండి గొడవ చేయిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై సివిల్‌ కేసులు కూడా ఉన్నాయని.. సివిల్‌ కేసులో ఎస్సె తలదూర్చుతున్నాడని అన్నారు.


అరెస్టు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ ఉండాలి కాబట్టే చేయలేదని అంటున్నారని.. అక్రమంగా లాక్‌పలో ఉంచారని బదులిచ్చారు. కాగా, ఈ వివాదంపై మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారిని వివరణ కోరగా.. జడ్జి రామకృష్ణ నివాసం పక్కనున్న భూమిని లీజుకు తీసుకున్నట్టుగా చెబుతున్న ఓ మహిళ.. సంబంధిత భూమిలో ప్రవేశించేందుకు ప్రయత్నించగా జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్ర అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆమె 100కు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఆ విషయమై కేసు నమోదు చేసిన బి.కొత్తకోట ఎస్సై సునీల్‌కుమార్‌.. విచారించేందుకే రామచంద్రను స్టేషన్‌కు పిలిపించారని చెప్పారు.అతడు తెచ్చిన డాక్యుమెంట్లు పరిశీలించి పంపివేసినట్లు తెలిపారు. ఇంటికి వెళ్లిన రామచంద్ర కొద్దిసేపటికే తిరిగి స్టేషన్‌కు వచ్చి బలవంతంగా కూర్చుండిపోయారని.. వెళ్లిపోవాలని ఎస్సై, సిబ్బంది ఎంత చెప్పినా వినిపించుకోకుండా మొండిగా స్టేషన్‌లోనే ఉండిపోయారని చెప్పారు. ఈ విషయంలో ప్రచారమవుతున్న ఇతరత్రా ఆరోపణలు పూర్తి అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు. కాగా.. ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై విచారణ జరపడానికే రామచంద్రను పిలిపించాం తప్ప లాక్‌పలో కూర్చోబెట్టలేదని, హింసించలేదని ఎస్సై వివరణ ఇచ్చారు.

Tags :
|

Advertisement