Advertisement

ఉద్యోగ వేట - నిలువు దోపిడీకి బాట

By: Dimple Wed, 09 Sept 2020 09:00 AM

ఉద్యోగ వేట - నిలువు దోపిడీకి బాట

మీరు ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారా? గూగుల్‌లో ఏ వెబ్‌సైట్‌ కనిపిస్తే అందులో మీ రెజ్యూమ్‌ను అప్‌లోడ్‌ చేస్తున్నారా? బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగం కల్పిస్తామంటూ ఫోన్లు వస్తున్నాయా? అయితే.. అప్రమత్తం కావాల్సిందే. లేదంటే సైబర్‌ కేటుగాళ్ల బారిన పడి రూ.లక్షలు కోల్పోవాల్సి వస్తుందంటూ సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఇలాంటి తరహా ఫిర్యాదుల సంఖ్య ఇటీవల పెరిగినట్లు వివరిస్తున్నారు.

గూగుల్‌లో ‘నీడ్‌ జాబ్‌’ అని కొడితే చాలు.. నౌకరీ.కామ్‌ తరహా వెబ్‌సైట్లు వందల సంఖ్యలో దర్శనమిస్తాయి. మనలో చాలా మంది తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలనే తొందర్లో ముందూ వెనకా ఆలోచించకుండా ప్రతి వెబ్‌సైట్‌లోనూ రెజ్యూమ్‌, ఇతర వివరాలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇదే సైబర్‌ కేటుగాళ్లకు వరంగా మారింది. ఆ సమాచారం ఆధారంగా ఫోన్‌ చేస్తున్నారు.

ఫలానా కన్సల్టెన్సీ నుంచి లేదా బహుళ జాతి కంపెనీల్లో హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అంటూ పరిచయం చేసుకుంటున్నారు. ఎంఎన్‌సీ కంపెనీల్లో పెద్ద హోదా.. మంచి జీతం ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. కాకపోతే.. కొంత రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌, సెక్యూరిటీ డిపాజిట్‌ కట్టాలని షరతూ విధిస్తున్నారు. సెక్యూరిటీ డిపాజిట్‌ తిరిగి ఇచ్చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

మోసగాళ్లు చెప్పినట్లుగానే డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయగానే మరోసారి ఫోన్‌ చేస్తున్నారు. మీ రెజ్యూమ్‌ను ఫలానా కంపెనీకి పంపించామని, అక్కడి హెచ్‌ఆర్‌ మేనేజర్‌ నుంచి ఫోన్‌ వస్తుందంటూ అప్రమత్తం చేస్తున్నారు. ముందే చెప్పినట్లు ఫోన్‌ చేసి ముఖాముఖి చేస్తున్నారు. ముఖాముఖిలో మంచి మార్కులు రాలేదంటూ మరికొంత వసూలు చేస్తున్నారు. అవి కూడా చెల్లించిన తర్వాత నకిలీ ఆఫర్‌ లెటర్లను ఈ-మెయిల్‌లో పంపుతున్నారు. ఏ రోజు జాయిన్‌ కావాలి, ఏయే ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకెళ్లాలనే వివరాలతో మరో మెయిల్‌ వస్తుందని నమ్మిస్తున్నారు.

కొన్ని రోజుల తర్వాత బాధితులు ఫోన్‌ చేస్తే.. అదే ఉద్యోగం కోసం మరో వ్యక్తి మీకంటే ఎక్కువ డబ్బులిచ్చాడని చల్లగా చెబుతున్నారు. అంతకంటే ఎక్కువిస్తే ఆ ఉద్యోగం మీదేనంటూ మరికొంత వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసేస్తున్నారు. ఇదే తరహాలో నానక్‌రాంగూడకు చెందిన ఓ యువతి నౌకరీ.కామ్‌లో రెజ్యూమ్‌ను ఈ ఏడాది మార్చిలో అప్‌లోడ్‌ చేసింది. సైబర్‌ కేటుగాళ్ల బారిన పడి రూ.38.18 లక్షలు మోసపోయింది. ఈ నెల 2న సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏ కంపెనీ కూడా ఉద్యోగం కల్పించేందుకు డబ్బు వసూలు చేయదని, ఆ వెబ్‌సైట్‌ గురించి పూర్తిగా కనుక్కున్న తర్వాతే రెజ్యూమ్‌ను అప్‌లోడ్‌ చేయడం మంచిదని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ సీహెచ్‌వై.శ్రీనివాస్‌ కుమార్‌ చెప్పారు.

Tags :
|
|

Advertisement