Advertisement

  • జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రాంతీయ భాషల్లో....కేంద్రం సంచలన నిర్ణయం

జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రాంతీయ భాషల్లో....కేంద్రం సంచలన నిర్ణయం

By: chandrasekar Fri, 23 Oct 2020 3:17 PM

జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రాంతీయ భాషల్లో....కేంద్రం సంచలన నిర్ణయం


ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకై నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మెయిన్స్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం(అక్టోబర్ 22) ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం (NEP)కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 'ఇకనుంచి జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించబడుతుంది. దాని ఆధారంగా రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

పీఐఎస్ఏ లాంటి పరీక్షల్లో టాప్ స్కోర్ సాధిస్తున్న దేశాలు తమ మాతృ భాషలోనే విద్యా బోధన సాగిస్తున్నాయన్న ప్రధాని మోదీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా పరీక్షలో విద్యార్థులు ప్రశ్నలను మరింత సమగ్రంగా అర్థం చేసుకోవడానికి, ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది.' అని కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. ఇటీవల నిర్వహించిన ఓ వెబినార్‌లో రమేష్ పోఖ్రియాల్ మాట్లాడుతూ.. 'మేము ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకం కాదు. అయితే మాతృభాషలో విద్యా బోధన ద్వారా భారతీయ భాషలను మరింత బలోపేతం చేయవచ్చు.' అని చెప్పారు. రాష్ట్రాలపై కేంద్రం బలవంతంగా ఏ భాషను రుద్దదని చెప్పారు. భారత్‌కు చెందిన 22 భాషలను మరింత బలోపేతం చేయడం తమ అసలు ఉద్దేశం అని స్పష్టం చేశారు.

Tags :

Advertisement