Advertisement

ఏపీలో దిశా చట్టం ఏమైంది?: పవన్ కళ్యాణ్

By: Anji Fri, 28 Aug 2020 1:44 PM

ఏపీలో దిశా చట్టం ఏమైంది?: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం మీడియాతో మాట్లాడూతూ... జనసేన శ్రేణులపై వైసీపీ అధికార పక్షం దాడులకు తెగబడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అప్రజాస్వామికమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని నిడిగట్టు పంచాయతీ నేరెళ్ళవలసకు చెందిన జనసేన కార్యకర్త మూగి ప్రసాద్, బీజేపీ కార్యకర్త మూగి శ్రీనివాస్‌లపై వైసీపీ నాయకుడు ఊళ్ళ చిన్నా హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు.

బాధితులు తీవ్ర గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. జనసేన నాయకులు ఆ ఇద్దరి పరిస్థితిని తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఈ ఘటన విషయంలో భీమిలి పోలీసులు అనుసరిస్తున్న విధానం, కేసులు నమోదు చేసిన తీరు అన్యాయంగా ఉందని వ్యాఖ్యానించారు. హత్య చేసేందుకు ప్రయత్నించిన అధికార పక్ష నేతను అరెస్ట్ చేయకుండా, బాధితుల పక్షాన నిలిచినవారిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని పవన్ అన్నారు.

ఆ ప్రాంతం వాలంటీర్‌గా పని చేస్తున్న వివాహితపై అధికార వైసీపీ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడితే మందలించారని సమాచారం ఉందన్నారు. వాలంటీర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలను కాపాడతామని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం ఏమైందని ప్రశ్నించారు.


నడిరోడ్డుపై హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఉండటం వెనక ఎవరి ఒత్తిళ్ళు ఉన్నాయో భీమిలి ప్రాంత ప్రజలకు అర్థం అవుతోందని తెలిపారు. పోలీసులు చట్టానికి బద్ధులై విధులు నిర్వర్తిస్తూ, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని.. అందుకు భిన్నంగా అధికార పక్షం కోసమే పని చేస్తామంటే న్యాయస్థానాల ద్వారా చట్టాన్ని పరిరక్షించుకుంటామని స్పష్టం చేశారు.


కొద్ది వారాల కిందటే విజయనగరంలో బీజేపీ నాయకుడిపై అధికార పక్ష గూండాలు హత్యాయత్నానికి తెగబడ్డారని మండిపడ్డారు. ఇప్పుడు భీమిలి నియోజకవర్గం పరిధిలో జనసేన, బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నానికి దిగారన్నారు. రాష్ట్ర డీజీపీ తక్షణం స్పందించి నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన, హత్యాయత్నంపై కేసులు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

Tags :
|

Advertisement