Advertisement

  • ఆంధ్రప్రదేశ్‌లో నవశకం - ప్రధానమంత్రి చేతులమీదుగా శ్రీకారానికి ప్రయత్నం

ఆంధ్రప్రదేశ్‌లో నవశకం - ప్రధానమంత్రి చేతులమీదుగా శ్రీకారానికి ప్రయత్నం

By: Dimple Sun, 09 Aug 2020 2:32 PM

ఆంధ్రప్రదేశ్‌లో నవశకం - ప్రధానమంత్రి చేతులమీదుగా శ్రీకారానికి ప్రయత్నం

ఆంధ్రప్రదేశ్‌లో నవశకం ఆరంభం కాబోతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానులతో పాలనకు శ్రీకారం చుట్టబోతున్నారు. అమరావతి శాసన రాజధానిగా... విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా.... కర్నూలు న్యాయరాజధానిగా... చేయాలనుకున్న ప్రభుత్వం... కార్యాలయాల నిర్మాణంకోసం భూమిపూజ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రత్యక్షంగా గానీ... పరోక్షంగా వర్చువల్‌గా పాలుపంచుకోవాలని ఆహ్వానించాలని నిర్ణయించింది. స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా పేదలకు ఇంటినివేశన స్థలాలనున పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని పనులకు శంకుస్థాపన, పేదలకు ఇంటి నివేశనస్థలాల పంపిణీ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైతే బాగుంటుందని ప్రభుత్వాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, ప్రధానమంత్రి అపాయింట్‌ మెంటుకోసం అభ్యర్థించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ప్రధాని మంత్రి కార్యాలయ సంయుక్త కార్యదర్శి శేషాద్రికి సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇటీవల లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని ప్రధాని కార్యాలయ ఓఎస్డీ సంజయ్‌ భవసర్‌కి కూడా పంపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవలే పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృతాభివృద్ధి చట్టాన్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఇక మూడు రాజధానులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటి. మూడు రాజధానుల శంకుస్థాపనకు ఆగస్టు 16న మంచి ముహూర్తంగా నిర్ణయించాం. తర్వాత మళ్లీ 2నెలల పాటు ముహూర్తాలు లేవు. అందువల్ల వీలైనంత త్వరగా ప్రధానితో అపాయింట్‌మెంట్‌ ఖరారు చేస్తే, ముఖ్యమంత్రి ఆయనను స్వయంగా కలిసి రెండు ప్రాజెక్టుల గురించి ఆయనకు వివరించి, ఆహ్వానిస్తారు’ అని శేషాద్రికి రాసిన లేఖలో ప్రవీణ్‌ ప్రకాష్‌ విజ్ఞప్తి చేశారు.అలాగే, 2022 నాటికి అందరికీ సొంత ఇళ్లు ఉండాలన్న ప్రధాని మోదీ లక్ష్యాన్ని ఆచరణలో పెట్టే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నామని పీఎంవోకు రాసిన లేఖలో ప్రవీణ్‌ ప్రకాష్‌ వివరించారు. ఈ పథకానికి రూ.20 వేల కోట్లు ఖర్చుచేసి, 62 వేల ఎకరాలు సమీకరించామని, 30 లక్షల మంది లబ్దిదారులకు స్థలాలు అందజేసి, తర్వాత ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద 2022 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి, ప్రధాని నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంటుందన్నారు.
కేంద్రం ఇప్పటికే 15 లక్షల ఇళ్లను మంజూరుచేసిందని, వచ్చే రెండేళ్లలో మరో 15 లక్షల ఇళ్లు మంజూరు చేయొచ్చని తన లేఖలో ప్రవీణ్ ప్రకాశ్ పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ మూలధన వ్యయం రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని, లాక్‌డౌన్‌ అనంతరం గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకునేందుకు అది ఎంతో దోహదం చేస్తుందని ప్రవీణ్‌ ప్రకాష్‌ వివరించారు. సుప్రీంకోర్టు నుంచి అనుమతి వచ్చాక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, మరో వారం రోజుల్లో తీర్పు వచ్చే అవకాశముందని తెలిపారు.

Tags :
|
|
|
|

Advertisement