Advertisement

  • మెరైన్ల కేసు మూసివేయాలంటే ఇటలీ పరిహారం చెల్లించాలి: సుప్రీంకోర్టు

మెరైన్ల కేసు మూసివేయాలంటే ఇటలీ పరిహారం చెల్లించాలి: సుప్రీంకోర్టు

By: chandrasekar Mon, 10 Aug 2020 2:15 PM

మెరైన్ల కేసు మూసివేయాలంటే ఇటలీ పరిహారం చెల్లించాలి: సుప్రీంకోర్టు


ఇటలీ బాధిత కేరళ మత్స్యకారుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తేనే ఆ దేశ మెరైన్లపై నమోదైన కేసు మూసివేతను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి బాధిత కుటుంబాల వాదన కూడా తాము వినాల్సి ఉన్నదని సుప్రీంకోర్టు న్యాయస్థానం పేర్కొంది. 2012 ఫిబ్రవరి 15న ఇటలీ రవాణా నౌకకు చెందిన ఇద్దరు మెరైన్లు సాల్వటోర్ గిరోన్, మాసిమిలియానో లాటోరే కేరళ మత్స్యకారుల పడవపై కాల్పులు జరుపడంతో ఇద్దరు చనిపోయారు.

ఇటలీ మెరైన్లపై కేరళలోనే విచారణ జరుపాలని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వగా వారు దానిని సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. మరోవైపు ఈ ఘటన అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరిగిందని, తమ మెరైన్లను భారత్‌ కోర్టుల్లో విచారించడం తగదంటూ ఇటలీ దేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా, హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (పీసీఏ) దీనిపై ఇటీవల తీర్పు ఇచ్చింది.

ఇటలీ మెరైన్లను భారత్‌ కోర్టుల్లో విచారించవద్దని చెప్పింది. అయితే కాల్పుల్లో చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇటలీ నుంచి పరిహారం పొందే అర్హత భారత్‌కు ఉన్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇటలీ మెరైన్ల కేసును మూసివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం జూలై 3న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కేంద్ర ప్రభుత్వం తరుఫున కోర్టుకు హాజరయ్యారు.

ఇద్దరు మైరన్లపై నమోదైన నేరారోపణలపై తమ దేశంలో విచారణ జరుపుతామని భారత్‌కు ఇటలీ భరోసా ఇచ్చిందని ఆయన చెప్పారు. అయితే బాధిత కుటుంబాలకు పరిహారం సంగతి ఏమిటని కోర్టు ఆయనను ప్రశ్నించింది. ఇటలీ నుంచి గరిష్ఠ పరిహారాన్నిఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మెహతా తెలిపారు. దీంతో పరిహారం చెక్కులతోపాటు బాధితుల తరుఫు వారిని కోర్టులో ప్రవేశపెట్టాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Tags :
|

Advertisement