Advertisement

  • యువరాజ్ సింగ్ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోబోతున్నాడా..?

యువరాజ్ సింగ్ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోబోతున్నాడా..?

By: chandrasekar Thu, 10 Sept 2020 2:55 PM

యువరాజ్ సింగ్ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోబోతున్నాడా..?


భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ టోర్నీ మధ్యలో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత టీ10 లాంటి విదేశీ ప్రైవేట్ లీగ్స్‌లో కూడా ఆడేశాడు. కానీ, ఇటీవల యువీని సంప్రదించిన పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ సెక్రటరీ పునీత్ బలి.. దేశవాళీ టోర్నీల్లో పంజాబ్‌ టీమ్‌ని ముందుండి నడిపించాలని యువరాజ్ సింగ్‌ని కోరాడు. పీసీఏ సెక్రటరీ అభ్యర్థనపై తాజాగా యువరాజ్ సింగ్ స్పందించాడు ‘‘ఇటీవల కొన్ని రోజులు యువ క్రికెటర్లు శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, అన్‌మోల్ ప్రీత్ సింగ్ తదితరులతో కలిసి నెట్స్‌లో సమయం గడిపాను. ఆ టైమ్‌లో వారికి ఆటలో మెలకువలు నేర్పించే క్రమంలో నేను కూడా బ్యాటింగ్ చేశాను. మ్యాచ్‌లు ఆడి చాలా రోజులైనా .. నెట్స్‌లో నేను చక్కగా బంతిని హిట్టింగ్ చేయగలిగాను. అప్పుడే నాకు అర్థమైంది నాలో ఇంకా ఆట మిగిలి ఉందని. పునీత్ కూడా ఆ ప్రాక్టీస్ సెషన్స్‌లో నా బ్యాటింగ్ చూసి రిటైర్మెంట్‌పై మళ్ళీ ఆలోచిస్తావా..? అని అడిగాడు’’ అని యువీ తెలిపాడు.

రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షాకి యువరాజ్ సింగ్ ఇప్పటికే మెయిల్‌ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. పంజాబ్ తరఫున ఆడాలని తాను కోరుకుంటున్నట్లు అందులో రాసుకొచ్చిన యువీ అవసరమైన అనుమతులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. సాధారణంగా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లని మాత్రమే విదేశీ ప్రైవేట్ లీగ్స్‌లో ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తుంది. ఒక్కసారి విదేశీ లీగ్స్‌లో క్రికెటర్ మ్యాచ్‌లాడితే మళ్లీ బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే ఏ టోర్నీలోనూ ఆడేందుకు అనుమతించరు. భారత్‌కి చెందిన సీనియర్ స్పిన్నర్ ప్రవీణ్ తంబే తొలుత రిటైర్మెంట్ ప్రకటించి విదేశీ లీగ్స్‌లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడేందుకు ప్రయత్నించగా బీసీసీఐ అనుమతించలేదు. మరి యువరాజ్ సింగ్ విషయంలో బీసీసీఐ నుంచి ఎలాంటి ఫలితం ఇస్తుందో వేచిచూడాలి.

Tags :
|

Advertisement