Advertisement

  • ఏడు మండలాలు మళ్లీ తెలంగాణలో విలీనమయ్యే అవకాశం ఉందా?

ఏడు మండలాలు మళ్లీ తెలంగాణలో విలీనమయ్యే అవకాశం ఉందా?

By: chandrasekar Fri, 13 Nov 2020 12:23 PM

ఏడు మండలాలు మళ్లీ తెలంగాణలో విలీనమయ్యే అవకాశం ఉందా?


హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ముంపు ప్రాంతాలుగా ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వెళ్లిన ఏడు మండలాలు మళ్లీ తెలంగాణలో విలీనమయ్యే అవకాశం ఉందా? పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని ఏపీ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించడంతో ఆ ఏడు మండలాలకు ముంపు ముప్పు అస్సలు ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కుక్కునూరు, వేలేరుపాడు, బుర్గంపహాడ్‌, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక మండలాలు ముంపునకు గురవుతాయంటూ కేంద్రం పట్టుబట్టి మరీ వాటిని ఏపీలో విలీనం చేసింది. ఈ పరిణామంపై అప్పట్లో టీఆర్‌ఎస్‌ తీవ్ర ఆందోళన, నిరసన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తరచుగా అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి ఈ విషయంలో మరింత గట్టిగా గొంతు వినిపించే అవకాశాలు ఉన్నాయి.

కారణం, ఏపీ సర్కారు పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించాలని నిర్ణయించడమే. వాస్తవానికి 45.72 మీటర్ల వరకు నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించాలన్నది ప్రాతిపాదన. అయితే నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్ల వరకే పరిమితం చేయాలని బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆ రాష్ట్ర సీఎం జగన్‌ నిర్ణయించారు. దీంతో వాస్తవంగా నిర్ణయించిన ప్రతిపాదన మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగితేనే ఈ ఏడు మండలాలకు బ్యాక్‌ వాటర్‌తో ముంపు ముప్పు ఉంటుందని, నీటి నిల్వ సామర్థ్యాన్ని దాదాపుగా 5 మీటర్ల మేర తగ్గించాలనే నిర్ణయంతో ఆ మండలాలకు ముప్పు ఎక్కడుంటుందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదించే అవకాశాలున్నాయి. బ్యాక్‌ వాటర్‌ తన్నుకొచ్చి.. మునిగే పరిస్థితే లేనప్పుడు విలీనం చేసుకున్న 7 మండలాలను ఏపీలో ఉంచడం దేనికి? మా మండలాలను మా రాష్ట్రానికి ఇచ్చేయండంటూ అటు కేంద్రం, ఇటు ఏపీ సర్కారుపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌, తనదైన శైలిలో మంత్రాంగం నడిపితే ఆ మండలాలు, రాష్ట్రంలో విలీనం కావడం పెద్ద కష్టమేమీ కాదనేది నిపుణుల అభిప్రాయం. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్‌ కూడా పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చునని అనుకుంటున్నారు.

Tags :
|

Advertisement