Advertisement

వారం రోజుల్లో ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌

By: Dimple Tue, 25 Aug 2020 10:54 AM

వారం రోజుల్లో ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌

యుఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ కు ఇంకా నెలరోజుల కంటే తక్కువ సమయమే మిగిలున్నా ఇప్పటి వరకూ బీసీసీఐ పూర్తి స్థాయి షెడ్యూల్ ను ప్రకటించలేదు. కేవలం సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకూ అటూ తేదీలు ప్రకటించిన ఐపీఎల్ పాలకమండలి... ఏ రోజు ఏ మ్యాచ్ ఎక్కడ అనే దానిపై మాైత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం పూర్తి స్థాయి షెడ్యూల్ కు సంబంధంచి బీసీసీఐ బృందం కసరత్తు చేస్తోంది. అక్కడి ఏర్పాట్లు, షెడ్యూల్ వంటి అంశాలపై చర్చించేందుకు దుబాయ్ చేరుకున్న బోర్డు ప్రతినిధులు, స్పాన్సర్లు, ఫ్రాంచైజీలు, బ్రాడ్ కాస్టర్లతో కలిసి షెడ్యూల్ పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే 53 రోజుల పాటు అలరించనున్న లీగ్ కు దుబాయ్ , అబుదాబి , షార్జ్ స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. కాగా కోవిడ్ కారణంగా షెడ్యూల్ డైనమిక్ గా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ల మధ్యలో గ్యాప్ ఉండే అవకాశాలు లేవు. అయితే లీగ్ స్టేజ్ ముగిసిన తర్వాత ఒకరోజు గ్యాప్ ఉంటుందని భావిస్తున్నారు. ఆతిథ్యమిస్తోన్న యుఏఈలో ఆటగాళ్ళకు ప్రయాణం బడలిక ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మూడు స్టేడియాలకు ప్రయాణ సమయం గంటన్నర - రెండు గంటల లోపే ఉండడం అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నాన్ స్టాప్ షెడ్యూల్ తో టీమ్స్ కు వచ్చే ఇబ్బందులేమీ ఉండవని అంచనా.

కాగా షెడ్యూల్ పై కసరత్తులు చేస్తోన్న బీసీసీఐ ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ళు రాకను దృష్టిలో ఉంచుకుంది. ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోన్న ఈ ఇరు జట్ల ఆటగాళ్ళు క్వారంటైన్ నిబంధనల దృష్ట్యా మొదటి వారం ఐపీఎల్ కు దూరం కానున్నారు. దీంతో తొలి వారం షెడ్యూల్ ను జాగ్రత్తగా రూపొందించాలని బోర్డు భావిస్తోంది. ఆసీస్, ఇంగ్లాండ్ క్రికెటర్లు ఎక్కువగా లేని జట్ల మధ్య మ్యాచ్ లతో తొలి వారం జరిగే అవకాశముంది. మిగిలిన షెడ్యూల్ కూడా కోవిడ్ ఎఫెక్ట్ తో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా డిజైన్ చేస్తోంది బోర్డు. ఇప్పటికే తీసుకున్న నిర్ణయం ప్రకారం 10 డబుల్ హెడ్డర్స్ ఉండనుండగా... మధ్యాహ్నం మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3.30 గంటలకు జరగనుండగా... రాత్రి మ్యాచ్ 7.30 గంటలకు మొదలుకానుంది.

కరోనా కారణంగా అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించని నేపథ్యంలో మ్యాచ్ టైమింగ్స్ పై ముందుగానే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ సారి టీవీ వ్యూయర్ షిప్ రికార్డ్ స్థాయిలో నమోదయ్యే అవకాశముండడంతో స్పాన్సర్లు, బ్రాడ్ కాస్టర్ల అభిప్రాయాలు షెడ్యూల్ రూపకల్పనలో కీలకం కానున్నాయి. కాగా వారం రోజుల లోపు ఐపీఎల్ 13వ సీజన్ పూర్తి స్థాయి షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించనుంది. ఇప్పటికే యుఏఈ చేరుకున్న అన్ని ఐపీఎల్ జట్లూ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాయి. క్వారంటైన్ పీరియడ్ ముగిసిన తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టనుండగా...పూర్తి బయోసెక్యూర్ బబూల్ లో లీగ్ జరగనుంది.

Tags :
|

Advertisement