Advertisement

ఐపీఎల్‌ తొలిసీజన్లో ఆరంభ మ్యాచ్‌ ఓ రికార్డు

By: Dimple Mon, 24 Aug 2020 00:15 AM

ఐపీఎల్‌ తొలిసీజన్లో ఆరంభ మ్యాచ్‌ ఓ రికార్డు

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టన్‌ గా రాహుల్‌ ద్రావిడ్‌, కోల్కతా నైట్‌ రైడర్స్‌ కెప్టన్‌గా సౌరవ్‌ గంగూలీ జట్లు బరిలోకి దిగాయి. తొలుత బ్యాటింగ్‌ కి దిగిన కోల్కతా నైట్‌ రైడర్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగింది. స్టేడియంలో కూర్చున్న క్రికెట్‌ అభిమానులు పరుగుల ప్రవాహాన్ని చూసి నిట్టూర్పు విడిచారు. చూసేది క్రికెట్టేనా అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినవారు లేకపోలేదు.

2008 ఏప్రిల్‌ 18 తేది రాత్రి సమయంలో ప్రారంభమైన మ్యాచ్‌లో కోల్కతా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ సంచలనం బ్రెండెన్‌ మెకల్లమ్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌ మెన్లుగా బరిలోకి దిగారు. ఓపెనింగ్‌ ఓవర్‌ ను సంధించిన ప్రవీణ్‌ కుమార్‌ బౌలింగ్‌ ను ఎదుర్కొన్న బ్యాట్స్‌ మెన్లకు ఇబ్బందికరంగా అన్పించింది. దీంతో తొలి ఓవర్లో కేవలం మూడే మూడు పరుగులు సాధించారు. రెండో ఓవర్‌ వేసేందుకొచ్చిన జహీర్‌ ఖాన్‌ బౌలింగ్ లో తొలి బంతి ఎదుర్కొన్న మెక్కల్లమ్‌ రెండో బంతినుంచి విశ్వరూపం చూపించాడు. స్టైలిష్‌ షాట్లతో విరుచుకుపడ్డాడు. రెండో బంతిని, మూడో బంతిని బౌండరీలుగా మలచిన మెకల్లమ్‌... నాలుగో బంతిని ఏకంగా సిక్సర్‌ గా మలచాడు... స్టేడియం హోరెత్తింది. ఐదో బంతిని బౌండరీగా తరలించి... అదే ఓవర్లో ఆఖరు బంతి బ్యాటుకు తగల్లేదు. దీంతో ఎలాంటి పరుగు రాలేదు. మూడో ఓవర్లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాగానే మెకల్లమ్‌ మరో బౌండరీ నమోదుచేశాడు. నాలుగో ఓవర్లో కళ్లు చెదిరే రెండు సిక్సర్లు... ఓ బౌండరీతో ఆకట్టుకున్నాడు. ఐదో ఓవర్ల తొలి బంతిని గంగూలీ బౌండరీ అందుకుంటే... మూడో బంతిని మెకల్లమ్‌ బౌండరీ కొట్టి హోరెత్తించాడు. అయితే ఆరో ఓవర్లో రెండో బంతికి కోల్కతా కెప్టెన్‌ గంగూలీ క్యాచ్‌ రూపంలో పెవీలియన్‌ బాట పట్టాడు.

మెకల్లమ్‌ కి తోడుగా వచ్చిన రికీ పాంటింగ్‌ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. రికీ పాంటింగ్‌ ఆరో ఓవర్ల ఎదుర్కొన్న జహీర్‌ ఖాన్ బౌలింగ్‌ లో ఒక్క పరుగుకూడా చేయలేకపోయాడు. అప్పటినుంచి వీలు దొరికినపుడు ఒక్కో పరుగును రాబట్టుకునే ప్రయత్నం చేశారు. పదో ఓవర్లో ఓ సిక్సర్‌ బాదిన మెకల్లమ్‌.. అక్కడనుంచి ఊపు పెంచాడు. ప్రతి ఓవర్లోనూ పరుగులు సాధనకోసమే ప్రయత్నించారు. 11 ఓవర్లో రికీ పాంటింగ్‌ తనదైన శైలిలో ఓ బౌండరీతోపాటు మరో సిక్సర్‌తో జోరు పెంచాడు. 13వ ఓవర్లో తొలిబంతికే రికీ పాంటింగ్‌ షాట్‌ ఆడబోయి ప్రవీణ్‌ కుమార్‌ కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆతర్వాత మెకల్లమ్‌కు తోడుగా వచ్చిన డేవిడ్‌ హస్సీ చక్కటి సహకారం అందించాడు. 13వ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన మెకల్లమ్‌, 14 ఓవర్లో నెమ్మదించారు. 15వ ఓవర్లో తొలి బంతికి డేవిడ్‌ హస్సీ ఒక బౌండరీ కొడితే... మెక్కల్లమ్‌ రెండు సిక్సర్ల, ఒక బౌండరీతో విరుచుకుపడ్డాడు. 16 ఓవర్లో కేవలం నాలుగు పరుగులు సాధించిన డేవిడ్‌ హస్సీ, మెక్కల్లమ్‌ జోడీ... 17వ ఓవర్లో మెకల్లమ్‌ సిక్సర్‌ తో 14 పరుగులు పిండుకుంది. 18వ ఓవర్లో తొలిబంతికే హస్సీ వైట్‌ కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మహ్మద్‌ హపీజ్ ‌ మెకల్లమ్‌ కు జతకట్టాడు. మెకల్లమ్‌ మాత్రం ఓ బౌండరీ కొట్టి హుషారుగా కన్పించాడు. 19 ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీతో మెకల్లమ్‌, మరో బౌండరీతో మహ్మద్‌ హఫీజ్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆఖరు ఓవర్లో బ్యాటింగ్‌ తో మెకల్లమ్‌ పూనకంతో ఊగిపోయాడు. తొలి రెండు బంతుల్ని, ఆఖరు బంతిని సిక్సర్‌ గా మలచిన మెకలమ్‌ 22 పరుగులు పిండుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా నైట్‌ రైడర్స్‌ మూడు వికెట్లు పోగొట్టుకుని 222 పరుగులు నమోదు చేసింది.

కోల్కతా 73 బంతుల్ని ఎదుర్కొన్న మెక్కల్లమ్‌ 10 బౌండరీలు, 13 సిక్సర్లతో 158 పరుగులతో అజేయంగా నిలిచాడు. రికీపాంటింగ్‌ 20 బంతుల్లో ఒక బౌండరీ, ఒక సిక్సర్‌తో 20 పరుగులు నమోదు చేశాడు. డేవిడ్‌ హస్సీ 12 బంతుల్లో ఒక బౌండరీతో 12 పరుగులు అందించాడు. కోల్కతా కెప్టన్‌ సౌరవ్‌ గంగూలీ 12 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 10 పరుగులు అందించాడు.

223 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తడబడింది. భారీ పరుగుల లక్ష్యాన్ని అధిగమించేందుకు ఆపసోపాలు పడింది. లక్ష్యఛేదనకు చేరువకాలేక చతికిల పడింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ తొలిబంతికే రాయల్‌ ఛాలెంజర్స్‌ కెప్టన్‌ రాహుల్‌ ద్రావిడ్ బౌల్డయ్యాడు. మూడో ఓవర్‌ రెండో బంతికి విరాట్‌ కోహ్లీ ఒకే పరుగుతో బౌల్డయ్యాడు. ఐదో ఓవర్లో ఐదో బంతికి జాక్వస్‌ కల్లిస్‌ క్యాచ్‌ రూపంలో వెనుదిరిగాడు. ఆరో ఓవర్‌ రెండో బంతికి వాసిమ్‌ జాఫర్‌ క్యాచ్‌ రూపంలో పెవీలియన్‌ బాటపట్టాడు. ఎనిమిదో ఓవర్లో ఐదో బంతికి మార్క్‌ బౌచర్‌ వెనుదిరిగాడు. తొమ్మిదో ఓవర్‌ రెండో బంతికి బాల చంద్ర అఖిల్‌ నిరాశపరచాడు. 38 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన రాయల్‌ ఛాలెంజర్స్‌ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. తొమ్మిదో ఓవర్‌ ఆఖరు బంతికి కెమరాన్‌ వైట్‌ వెనుదిరిగాడు. 12 ఓవర్లో తొలిబంతికి ఆశ్లే నాఫ్కీ రనౌట్‌తో పెవీలియన్‌ బాట పట్టాడు. 14వ ఓవర్‌ తొలిబంతికి జహీర్‌ ఖాన్‌ ను గంగూలీ బోల్తా కొట్టించాడు. 16ఓవర్లో తొలిబంతికి సునీల్‌ జోషీ క్యాచ్‌ను మెకల్లమ్‌ ఒడిసి పట్టుకోవడంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ కథ ముగిసింది.

Tags :
|

Advertisement