Advertisement

  • IPL 2020: కోల్‌కతా బౌలర్లని ఉతికారేసిన ఢిల్లీ... కోల్‌కతా టార్గెట్ 229

IPL 2020: కోల్‌కతా బౌలర్లని ఉతికారేసిన ఢిల్లీ... కోల్‌కతా టార్గెట్ 229

By: Anji Sat, 03 Oct 2020 10:12 PM

IPL 2020: కోల్‌కతా బౌలర్లని ఉతికారేసిన ఢిల్లీ... కోల్‌కతా టార్గెట్ 229

ఐపీఎల్ 2020 సీజన్‌లో భారీ స్కోరు నమోదైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో షార్జా వేదికగా శనివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ (88 నాటౌట్: 38 బంతుల్లో 7x4, 6x6), పృథ్వీ షా (66: 41 బంతుల్లో 4x4, 4x6) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది. కోల్‌కతా బౌలర్లని ఉతికారేసిన ఢిల్లీ క్యాపిటల్స్ హిట్టర్లు ఏకంగా 14 సిక్సర్లు, 18 ఫోర్లు బాదడం గమనార్హం.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ ఇన్నింగ్స్ ప్రారంభించిన శిఖర్ ధావన్ (26: 16 బంతుల్లో 2x4, 2x6), పృథ్వీ షా జోడీ తొలి వికెట్‌కి 5.5 ఓవర్లలోనే 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. స్పిన్నర్ నరైన్ బౌలింగ్‌ని లక్ష్యం చేసుకుని బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదిన ధావన్.. తర్వాత చక్రవర్తి బౌలింగ్‌లో సిక్స్ కొట్టబోయి ఔటయ్యాడు.

అయితే.. అనంతరం వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌‌తో పృథ్వీ షా చెలరేగిపోయాడు. ఓవర్‌కి ఒక ఫోర్ లేదా సిక్స్ చొప్పున కొడుతూ వచ్చిన ఈ జోడీ.. ఏ దశలోనూ రన్‌రేట్‌‌ని 10కి తగ్గనివ్వలేదు. కానీ.. జట్టు స్కోరు 129 వద్ద పృథ్వీ షా ఔటవగా.. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (38: 17 బంతుల్లో 5x4, 1x6) కూడా బ్యాట్ ఝళిపించేశాడు.

కానీ.. ఆఖర్లో స్టాయినిస్ (1), సిమ్రాన్ హిట్‌మెయర్ (7 నాటౌట్) ఆశించినంత వేగంగా ఆడలేకపోగా.. సెంచరీ చేసేలా కనిపించిన శ్రేయాస్ అయ్యర్ 88 పరుగుల వద్దే ఆగిపోయాడు.

Tags :

Advertisement