Advertisement

  • తెలంగాణాకు రానున్న అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థ

తెలంగాణాకు రానున్న అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థ

By: chandrasekar Fri, 02 Oct 2020 12:30 PM

తెలంగాణాకు రానున్న అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థ


ఆర్థిక సేవల రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గోల్డ్‌మన్‌ శాక్స్‌.. భారత్‌లో తమ రెండో కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఈ విషయమై ఆ సంస్థ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుతో సంప్రదింపులు జరిపారు. వారి ప్రయత్నాలకు మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో గోల్డ్‌మన్‌ శాక్స్‌ చేపట్టే వెంచర్లకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ తోడ్పాటును అందజేస్తుందని మంత్రి తెలియజేసారు. ఇప్పటికే బెంగళూరులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న గోల్డ్‌మన్ దాదాపు 500 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో కార్యాలయాన్ని నెలకొల్పాలని భావిస్తున్నది. ఈ కార్యాలయం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభమయ్యే అవకాశమున్నది.

గోల్డ్‌మన్‌ శాక్స్‌ చరిత్ర

ఆర్థిక సేవల రంగంలో విశ్వవిఖ్యాతి పొందిన గోల్డ్‌మన్‌ శాక్స్‌ అమెరికాలో బహుళజాతి పెట్టుబడుల బ్యాంకును నడుపుతున్నది. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌ను కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్న ఈ సంస్థ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌, సెక్యూరిటీలు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, ప్రైమ్‌ బ్రోకరేజీ సేవలతోపాటు సంస్థాగత పెట్టుబడిదారులకు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సేవలను అందిస్తున్నది. ప్రపంచంలోని అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థల్లో ఒకటిగా భాసిల్లుతున్న గోల్డ్‌మన్‌ శాక్స్‌.. అమెరికా ట్రెజరీ సెక్యూరిటీ మార్కెట్‌కు ప్రధాన డీలర్‌గా కొనసాగుతున్నది.

1869లో స్థాపితమైన ఈ గ్రూపునకు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలున్నాయి. ఈ ఏడాది మే చివరి నాటికి ఆదాయపరంగా అమెరికాలోని అతిపెద్ద కార్పొరేషన్లతో రూపొందించిన ఫార్చ్యూన్‌-500 జాబితాలో గోల్డ్‌మన్‌ శాక్స్‌ 62వ స్థానంలో నిలిచింది. 2019లో ఈ సంస్థ ఆదాయం 3654.6 కోట్ల డాలర్లు. గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్రూపులో పనిచేసిన ఎంతో మంది ఉద్యోగులు ఆ తర్వాత అమెరికాతోపాటు వివిధ దేశాల ప్రభుత్వాల్లో కీలక పదవులను అలంకరించారు.

దేశీయ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన వ్యాపారంలో 17 బిలియన్‌ డాలర్ల వాటాను వాల్‌మార్ట్‌కు అప్పగించడంలో గోల్డ్‌మన్‌ ముఖ్య భూమిక పోషించింది. అమెరికా ఆర్థిక మంత్రులుగా పనిచేసిన రాబర్ట్‌ రూబిన్‌, హెన్స్రీ పాల్‌సన్‌, ఇటలీ మాజీ ప్రధాని మారియో మోంటి, ఆస్ట్రేలియా మాజీ ప్రధాన మంత్రి మాల్కమ్‌ టర్న్‌బుల్‌ లాంటి ఎంతో మంది ప్రముఖులు గోల్డ్‌మన్‌ శాక్స్‌ మాజీ ఉద్యోగులే.

Tags :
|

Advertisement