Advertisement

భారత క్రికెట్‌లో ధోనీ శకం ప్రత్యేకం

By: Dimple Wed, 19 Aug 2020 00:32 AM

భారత క్రికెట్‌లో ధోనీ శకం ప్రత్యేకం

క్రికెట్ నేపథ్యమే లేని కుటుంబం... అంతగా ఎవ్వరికీ తెలియని పట్టణం..ఇదీ భారత క్రికెట్‌లోకి అడుగుపెట్టకముందు ధోనీ పరిస్థితి.. రాంఛీ నుంచి వచ్చిన ఓ డైనమైట్ భారత క్రికెట్‌లో పేలుతుందని, టీమిండియాను అత్యున్నత స్థాయిలో నిలబెడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. 2007 వన్డే వరల్డ్‌కప్‌ వైఫల్యం తర్వాత జట్టు పగ్గాలు అందుకున్నప్పటి నుంచీ భారత క్రికెట్‌లో ధోనీ శకం మొదలైంది.

భారత్‌లో క్రికెట్‌ను మతమైతే.. క్రికెటర్లు దేవుళ్ళు... ఎంతో సత్తా ఉంటే తప్ప జాతీయ జట్టులో చోటు దక్కదు. చోటు దక్కినా దానిని నిలుపుకోవాలంటే ఎప్పటికప్పుడు టాలెంట్ నిరూపించుకోవాల్సిందే. అయితే జట్టులోకి వచ్చిన తక్కువ కాలంలోనే కీలక ఆటగాడిగా ఎదగడం, అన్నింటికీ మించి మూడేళ్ళ వ్యవధిలోనే సారథ్య బాధ్యతలు అందుకోవడం ధోనీకే చెల్లింది. 2005లో రెండు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న మహి తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2007 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యాన్ని ఎవ్వరూ మరిచిపోలేరు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాహుల్ ద్రావిడ్ నుంచి జట్టు పగ్గాలు అందుకున్న ధోనీ సమర్థవంతంగా లీడ్ చేశాడు. ముఖ్యంగా 2007 టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ఏ మాత్రం అంచనాలు లేకుండా వెళ్ళిన టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు. టీ ట్వంటీలకు యువక్రికెటర్లే కావాలంటూ సెలక్టర్లకు సూటిగా చెప్పేసిన మహి దానికి తగ్గట్టుగానే ఫలితాన్ని రాబట్టాడు. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవడానికి సమిష్టి కృషి ఎంతుందో... ధోనీ కెప్టెన్సీ కూడా అంతే ఉంది.

ఇదిలా ఉంటే 2008లో టెస్ట్ కెప్టెన్‌గానూ బాధ్యతలు అందుకున్న మహేంద్రుడు కేవలం ఏడాది వ్యవధిలోనే జట్టును ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన నిలిపాడు. ఆ తర్వాత విదేశీ గడ్డపై భారత్ రికార్డును మరింత మెరుగుపరిచిన ధోనీ పలు కీలక విజయాలతో తన జోరు కొనసాగించాడు. ఇక 2011 ప్రపంచకప్ ధోనీ కెరీర్‌లోనే అతిపెద్ద మైలురాయి. భారత క్రికెట్ అభిమానుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత ధోనీదే. కపిల్‌దేవ్ తర్వాత దేశానికి ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన మహి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.

2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియాను విజేతగా నిలబెట్టడం ద్వారా అరుదైన రికార్డ్ సాధించాడు. అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథిగా ఘనత సాధించాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన గంగూలీ రికార్డును ధోనీ బ్రేక్ చేసింది కూడా ఇదే ఏడాది. కాగా 2015 ప్రపంచకప్‌లోనూ జట్టును సెమీస్‌కు చేర్చిన ధోనీ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అలాగే టెస్టులకూ గుడ్‌బై చెప్పేసి పరిమిత ఓవర్ల ఫార్మేట్‌లో మాత్రమే కొనసాగాడు. ధోనీ తన కెరీర్‌లో 90 టెస్టులాడి 38.09 యావరేజ్‌తో 4876 పరుగులు చేశాడు. దీనిలో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే 350 వన్డేల్లో 50.57 యావరేజ్‌తో 10 వేల 773 పరుగులు చేయగా... దీనిలో 10 శతకాలు, 73 అర్థశతకాలు ఉన్నాయి. ఇక 98 టీ ట్వంటీల్లో 37.60 సగటుతో 1617 పరుగులు సాధించాడు. 16 ఏళ్ళ కెరీర్‌ను డకౌట్‌తో ప్రారంభించిన ధోనీ కెరీర్‌... 2019 ప్రపంచకప్ సెమీస్‌లో రనౌట్‌తోనే ముగుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే భారత క్రికెట్‌కు రెండు ప్రపంచకప్‌లతో పాటు పలు అద్భుత విజయాలు అందించిన మహేంద్రుని శకం ఎప్పటికీ ప్రత్యేకమే.

Tags :
|

Advertisement