Advertisement

  • భారత స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ కు కరోనా పాజిటివ్ ..గోపీచంద్ అకాడమీ తాత్కాలిక మూసివేత

భారత స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ కు కరోనా పాజిటివ్ ..గోపీచంద్ అకాడమీ తాత్కాలిక మూసివేత

By: Sankar Fri, 14 Aug 2020 08:09 AM

భారత స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ కు కరోనా పాజిటివ్ ..గోపీచంద్ అకాడమీ తాత్కాలిక మూసివేత


భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డికి కరోనా వైరస్ సోకింది. హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో ఇటీవల ప్రారంభమైన క్యాంప్‌నకి హాజరైన సిక్కిరెడ్డి‌తో పాటు ఫిజియోథెరపిస్ట్ కిరణ్‌ కూడా కరోనా వైరస్ బారినపడినట్లు తేలింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. గత మార్చి నుంచి ఆటకి దూరంగా ఉన్న షట్లర్లు.. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టేడియాలు, అకాడమీల్లో ప్రాక్టీస్‌కి అనుమతి ఇవ్వడంతో టోక్యో ఒలింపిక్స్ కోసం సన్నద్ధతని మొదలెట్టారు.

బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో ఇటీవల ఈ క్యాంప్ ప్రారంభమవగా.. షట్లర్లు పీవీ సింధు, సిక్కిరెడ్డి, సాయి ప్రణీత్ ఈ క్యాంప్‌నకి హాజరయ్యారు. అయితే.. ఆటగాళ్లతో పాటు కోచ్‌‌లు, సపోర్ట్ స్టాఫ్‌‌కి విధిగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆదేశించింది. దాంతో.. గోపీచంద్ అకాడమీలో పరీక్షలు నిర్వహించగా.. సిక్కిరెడ్డితో పాటు కిరణ్‌కి పాజిటివ్‌గా తేలింది. కానీ.. వారిలో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని తెలుస్తోంది.

అయితే వీరిద్దరికీ ఎలాంటి లక్షణాలు లేవని ‘బాయ్‌’ వివరించింది. శానిటైజ్‌ చేసేందుకు అకాడమీని తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం కరోనా పరీక్షలకు హాజరైన వారందరూ శుక్రవారం స్థానిక కార్పొరేట్‌ ఆసుపత్రిలో మరోసారి కోవిడ్‌ టెస్టులు చేయించుకుంటారని తెలిసింది. సిక్కి రెడ్డి, కిరణ్‌ ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి వారందరికీ ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయనున్నారు.

‘భారత స్పోర్ట్స్‌ అథారిటీ నిబంధనల ప్రకారం జాతీయ శిక్షణ శిబిరంతో సంబంధం ఉన్న క్రీడాకారులకు, కోచ్‌లకు, సహాయ సిబ్బందికి, కార్యాలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. కోచింగ్‌ క్యాంప్‌ మళ్లీ సజావుగా సాగేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సాధ్యమైనంత త్వరలో మళ్లీ శిబిరం ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాం’ అని జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ వ్యాఖ్యానించారు..

ఇక ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, ఆమె తండ్రి పీవీ రమణ, చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్‌ సహా 18 మందికి నెగెటివ్‌ ఫలితం రాగా... సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్‌ కిరణ్‌లకు కరోనా పాజిటివ్‌ తేలిందని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :
|
|
|
|

Advertisement