Advertisement

  • భారత్ త్వరలో చైనా దిగుమతులపై కూడా నిషేధం విధించే ప్రయత్నం

భారత్ త్వరలో చైనా దిగుమతులపై కూడా నిషేధం విధించే ప్రయత్నం

By: chandrasekar Wed, 01 July 2020 3:42 PM

భారత్ త్వరలో చైనా దిగుమతులపై కూడా నిషేధం విధించే ప్రయత్నం


లడక్ గల్వాన్‌ లోయలో భారత సైనికులపై దాడికి దిగి 20 మందిని హతమార్చిన నేపథ్యంలో చైనాను ఏకాకిగా చేసేందుకు భారత్‌ కంకణం కట్టుకొన్నది. చైనాను సైనికపరంగా కాకుండా ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్‌ పావులు కదుపుతున్నది.

టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చైనా యాప్‌లపై నిషేధం విధించిన భారత్ త్వరలో చైనా దిగుమతులపై కూడా నిషేధం విధించే యత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తున్నది.

చైనా వస్తువుల దిగుమతులపై నిషేధ నిర్ణయం తీసుకునే ముందు పారిశ్రామిక సంస్థలు, ఇతర ఉత్పాదక సంఘాలు, ఎగుమతిదారుల అభిప్రాయాలను కోరింది.

చైనా నుంచి దిగుమతులపై నిషేధం విధించిన సందర్భంలో ఎదురయ్యే ఇబ్బందులేమితో వారిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలిసింది. మరీ ముఖ్యంగా ప్రత్యామ్నాయాల గురించి అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు సమాచారం. టెలికాం, చైనీస్ యాప్‌లపై నిషేధపు ఆంక్షల విధింపు తరువాత ఇప్పుడు దిగుమతులను కఠినతరం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు స్పష్టమైంది. చైనా నుంచి దిగుమతి చేసుకొంటున్న వస్తువుల జాబితా ఇవ్వాల్సిందిగా వివిధ పారిశ్రామిక సంస్థలు, ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్‌ను ప్రభుత్వం ఇప్పటికే కోరింది.

తద్వారా ఏయే వస్తువులను మన దేశంలో సులభంగా తయారు చేసుకోవచ్చో గుర్తించి ఆ వస్తువులను నిషేధించడం ద్వారా భారతీయ తయారీదారులకు ఎటువంటి హాని ఉండదని భావిస్తున్నది. చైనాకు బదులుగా ఇతర దేశాల నుంచి ముఖ్యమైన వస్తువులు, ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడంపై ఆలోచిస్తున్నారు.

చైనా వస్తువుల ఎంపికకు సంబంధించి పారిశ్రామిక ప్రపంచం నుంచి భారత ప్రభుత్వం అభిప్రాయాలు తెలుసుకొంటున్నది. ఆయా వస్తువులను ఇక్కడే తయారుచేసి భర్తీ చేయాలన్న నిర్ణయంతో ముందగుడు వేస్తున్నారు. ఔషధాలు, ఆటో విడిభాగాలు, మొబైల్ ఫోన్స్‌, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, రసాయనాలు వంటివి అనేకం చైనా నుంచి మనం దిగుమతి చేసుకొంటున్నాం.

కొన్ని రోజులుగా చైనా నుండి ముడి పదార్థాల సరఫరా నిలిచిపోవడం వల్ల వస్తువుల ఉత్పత్తి సాధ్యం కాలేదు. 90 శాతం ఔషధ తయారీ ముడి పదార్థాల కోసం, 70 శాతం మొబైల్‌ ఫోన్ల కోసం చైనాపై భారత్‌ ఆధారపడుతున్నది. ఆటో విడిభాగాలను తయారు చేయడానికి చైనా నుండి అనేక ముడి పదార్థాలు వస్తున్నాయి. అవి లేకుండా విడిభాగాలు తయారు చేయలేని పరిస్థితులు ఉన్నాయి.

చైనా ముడి పదార్థాలపై పూర్తిగా ఆధారపడే అనేక సౌందర్య ఉత్పత్తులు ఉన్నాయి. చైనా నుంచి తక్కువ ధరకు ముడి పదార్థాలు లభిస్తున్నందున వేరే దేశాల దిగుమతులపై దృష్టిసారించడం లేదని పలువురు వ్యాపారవేత్తలు అంటున్నారు. మనం ఖరీదైన వస్తువులను కొనవలసి వచ్చినప్పటికీ ప్రభుత్వం ధైర్యమైన నిర్ణయాలు తీసుకొంటుందని పీహెచ్‌డీ ఛాంబర్ టెలికాం కమిటీ చైర్మన్ సందీప్ అగర్వాల్ అభిప్రాయపడుతున్నారు. అన్ని రంగాల్లో వస్తువులకు భారతీయ కంపెనీలకు ట్రయల్ ఆర్డర్లు ప్రవేశపెట్టాలని ఆయన సూచిస్తున్నారు. ఇటు వంటి నిర్ణయాలతో టెలికాం రంగంలో చైనాతో పోటీ పడటానికి ఇండియా కంపెనీలకు వీలు అవుతుందని చెప్తున్నారు.

Tags :
|
|

Advertisement