Advertisement

  • IND Vs AUS ODI Series: ఇండియా కు తొలి విజయం.. మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ ఇదే..!

IND Vs AUS ODI Series: ఇండియా కు తొలి విజయం.. మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ ఇదే..!

By: Anji Wed, 02 Dec 2020 7:57 PM

IND vs AUS ODI series: ఇండియా కు తొలి విజయం.. మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ ఇదే..!

ఆస్ట్రేలియాతో కాన్‌బెర్రా వేదికగా బుధవారం జరిగిన మూడో వన్డేలో ఫాస్ట్ బౌలర్‌ జస్‌ప్రీత్ బుమ్రా ఒక్క ఓవర్‌లో మ్యాచ్‌ని భారత్‌ వైపు తిప్పాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేయగా.. అనంతరం ఛేదనలో గ్లెన్ మాక్స్‌వెల్ (59: 38 బంతుల్లో 3x4, 4x6) దూకుడుగా ఆడుతూ ఆస్ట్రేలియాని గెలిపించేలా కనిపించాడు.

ఇన్నింగ్స్ 36వ ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదిన మాక్స్‌వెల్.. అనంతరం నటరాజన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనూ బంతిని స్టాండ్స్‌లోకి కొట్టేశాడు. దాంతో.. చూస్తుండగానే ఆస్ట్రేలియా గెలుపు సమీకరణం 36 బంతుల్లో 39 పరుగులుగా మారిపోయింది.

మాక్స్‌వెల్ క్రీజులో ఉన్నంతసేపూ భారత్ గెలుపుపై ఎవరికీ ఆశల్లేవు. అంతలా అతని హిట్టింగ్ కనిపించింది. కానీ.. ఇన్నింగ్స్ 45వ ఓవర్ వేసిన జస్‌ప్రీత్ బుమ్రా మాయ చేశాడు.

ఆ ఓవర్‌లో తొలుత బౌన్సర్‌తో మాక్స్‌వెల్‌ని బుమ్రా పరీక్షించగా.. బంతి ఎక్కువ ఎత్తుగా వెళ్లడంతో అంపైర్ దాన్ని వైడ్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత లెగ్ సైడ్ యార్కర్‌ని సంధించాడు. కానీ.. అది వైడ్‌గా వెళ్లింది.

దాంతో.. బుమ్రా ఒత్తిడిలో ఉన్నాడని భ్రమపడిన మాక్స్‌వెల్.. వికెట్లని వదిలేసి వెనక్కి వెళ్లి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ.. అదే అదనుగా బుమ్రా తన ప్రధాన అస్త్రం యార్కర్‌ని సంధించాడు. దాంతో.. ఆ బంతిని అడ్డుకునేందుకు మాక్స్‌వెల్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.

అతని బ్యాట్‌కి అందని బంతి నేరుగా వెళ్లి వికెట్లని గీరాటేసింది. మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ ఇదే.మాక్స్‌వెల్ ఔట్ తర్వాత ఒత్తిడికి గురైన ఆస్ట్రేలియా.. వరుసగా వికెట్లు చేజార్చుకుని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 289 పరుగులకి ఆలౌటైంది.

దాంతో.. మూడు వన్డేల సిరీస్‌ని 1-2తో భారత్ ముగించింది. తొలి రెండు వన్డేల్లో చెప్పుకోదగ్గ బౌలింగ్ ప్రదర్శన చేయలేకపోయిన బుమ్రా.. ఈ మ్యాచ్‌లో 9.3 ఓవర్లు వేసి కేవలం 43 పరుగులే ఇచ్చాడు. మాక్స్‌వెల్‌ వికెట్ తీయడంతో పాటు ఆస్ట్రేలియా చివరి వికెట్‌ ఆడమ్ జంపా(4)ని బుమ్రానే ఔట్ చేశాడు.

Tags :

Advertisement